Spirituality

Spirituality: శంఖం మనకు చెప్పే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి?..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఓంకార నాదానికి ప్రతీక అయిన శంఖం పైకి గట్టిగా కనిపిస్తూ.. లోపల ఖాళీగా ఉంటుంది. మన జీవితంలో కూడా అహంకారం, మమకారాలు అనే లోపలి కల్మషాలను ఖాళీ చేసినప్పుడే పరమాత్మ నాదం మనలో ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

శంఖం సనాతన సంస్కృతికి నాద స్వరూపం, సృష్టి సంకేతం, మానవ జీవితానికి మహోన్నత ఆధ్యాత్మిక మార్గదర్శి. క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన శంఖాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించి, తన హస్తంలో అలంకరించుకున్నాడు. అందుకే ఎక్కడైతే శంఖం ఉంటుందో, ఎక్కడైతే దాని ధ్వని ప్రతిధ్వనిస్తుందో అక్కడ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు సకల వ్యతిరేక శక్తులు నశించి, ధర్మం, శాంతి, మంగళకరమైన వాతావరణం నెలకొంటాయని శాస్త్రాలు చెబుతాయి..

శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుని వింటే, లోపల అనంతమైన సముద్ర ఘోషలా ఓం అనే ప్రణవ నాదం ప్రతిధ్వనిస్తుందని అంటారు.. మనం ఊపిరి పీల్చి శంఖాన్ని ఊదినప్పుడు, అది పవిత్రమైన నాదంగా మారి ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలా ఊదడం వల్ల మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని అలాగే ఆధ్యాత్మికంగా మనసును ప్రశాంతపరిచే పవిత్ర శక్తి బయటికి వస్తుందని ఆథ్యాత్మిక వేత్తలు పేర్కొంటారు..

ఓంకార నాదానికి ప్రతీక అయిన శంఖం పైకి గట్టిగా కనిపిస్తూ.. లోపల ఖాళీగా ఉంటుంది. మన జీవితంలో కూడా అహంకారం, మమకారాలు అనే లోపలి కల్మషాలను ఖాళీ చేసినప్పుడే పరమాత్మ నాదం మనలో ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శంఖంలో పోసిన నీరు పవిత్ర తీర్థంగా ఎలా మారుతుందో, భగవంతుడికి అంకితమైన మనస్సు కూడా అలాగే పవిత్రం అవుతుందనడానికి నిదర్శనం శంఖం అని చెబుతారు..

ఇక శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా శంఖం నుంచి వచ్చే ధ్వని తరంగాలు పర్యావరణంలోని ప్రతికూల శక్తులను పటాపంచలు చేస్తాయి. ఇది చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనస్సును సానుకూల శక్తితో నింపుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఊదిన పాంచజన్యం విజయాన్నే కాక, అధర్మంపై ధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టే దివ్య నాదంగా భావించబడింది. జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంతో, సత్య నిష్ఠతో ముందుకు సాగాలని శంఖ నాదం మనల్ని హెచ్చరిస్తుంది.

సముద్రపు అడుగున పుట్టి జగత్తుకే పవిత్రతను పంచే శంఖంలాగే, సన్మార్గంలో నడుస్తూ మన అంతరంగాన్ని నిశ్చలం చేసుకోవడమే శంఖం మనకు ఇచ్చే ఆథ్యాత్మిక సందేశం. అందుకే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం ఉందని, ఆ అర్థం తెలిసినప్పుడు ఆచారం భక్తిగా మారుతుందని పండితులు అంటారు..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#conch#Negative Energy#message#Goddess Lakshmi#Lord Maha Vishnu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి