Hit And Run Case: తండ్రులు బాగా డబ్బున్నోళ్లు.. ఖరీదైన కార్లు కొన్చిచారు.. ఇంకేముంది వారి పుత్రరత్నాలు రెచ్చిపోయారు. రద్దీ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ తో చెలరేగిపోయారు. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిపేశారు. వారి కుటుంబాల్లో అంతులేని శోకం మిగిలించారు. ఇంత జరిగినా.. కారుతో గుద్ది చంపేసినా.. వారికి మాత్రం శిక్షలు పడలేదు. ఎందుకంటే వారు బడా బాబుల పుత్రరత్నాలు మరి.
మొన్న మాదాపూర్ లో.. నిన్న రాయదుర్గంలో.. సేమ్ అదే సీన్.. ర్యాష్ డ్రైవింగ్.. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంత ఘోరం జరిగినా.. ఇద్దరి ప్రాణాలు పోయినా.. చర్యలు మాత్రం శూన్యం.
ఇటీవల రాయదుర్గంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. కారుని నిర్లక్ష్యంగా నడిపి ఒకరి ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తికి బెయిల్ రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇది ఇలా ఉంటే.. హైదరాబాద్ లో చోటు చేసుకున్న మరో కారు యాడ్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్ అసలు అరెస్టే కాకపోవడం మరింత షాక్ కి గురి చేస్తోంది.
ఒకరు ఆనంద్ సాయి కుమారుడు, మరొకరు లింగమనేని రమేశ్ కొడుకు.. ఈ ఇద్దరూ ప్రముఖ వ్యక్తులే. బడా బాబులే. రాజకీయ పలుకుబడి ఉన్న వారే. వీరి పుత్రుల కారణంగా రెండు నిండు ప్రాణాలు పోయాయి. హిట్ అండ్ రన్ కేసులో సందీప్ కి బెయిల్ రావడం పై జనం తీవ్రంగా మండిపడుతున్నారు. అంత ఈజీగా బెయిల్ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే సందీప్ కు బెయిల్ మంజూరు కావడంపై జనాలు సీరియస్ అవుతున్నారు. రాజకీయ పలుకుబడితో సందీప్ బెయిల్ మీద బయటకు వచ్చాడని అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్కిటెక్ట్ గా ఆనంద్ సాయి ప్రసిద్ది చెందారు. ఎన్నో ఆలయాలకు నమూనాలు అందించారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు.
ఇక మరో కేసులోనూ ఇదే జరిగింది. ఆ కేసులో మరీ దారుణం. ర్యాష్ డ్రైవింగ్ చేసి కారుతో ఢీకొట్టి ఓ యువతి ప్రాణం పోవడానికి కారణం అయినా.. అతడిని పోలీసులు కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. అతడే జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్. ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్ స్టైల్ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేసే భారతి అనే యువతి ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొని చనిపోయింది. ఆ కారు నడిపింది సంజూష్. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. చర్యలు తీసుకోవడంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించారు. పోలీసులు సంజూష్ ని కనీసం అరెస్ట్ కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనికి కారణం రాజకీయ పలుకుబడి అని తెలుస్తోంది. సంజూష్ పై పోలీసులు నామమాత్రపు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయడం వారి ఉదాసీనతకు నిదర్శనం. ఈ కేసు నుంచి అతడిని తప్పించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఇద్దరి తీరు చూస్తుంటే.. ఖరీదైన కార్లతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం.. జనాలను గుద్దేస్తాం.. మా బాబులు చూసుకుంటారులే అనే ధీమాలో ఉన్నట్లుగా అర్థం అవుతోంది. బడా బాబులూ.. మీ పిల్లలని మీరే కోలుకోలేని స్థితిలో చెడగొట్టేస్తున్నారా..!!?? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మృతుల కుటుంబాల శోకాన్ని అర్థం చేసుకునే వారు ఏరి..? వాళ్ళ ప్రాణాలకు లెక్క లేదా..? యాక్సిడెంట్ చేసి ఆగకుండా వెళ్లిపోయి తప్పించుకుందామని చూసిన ఆనంద్ సాయి కుమారుడికి ఎందుకు స్వేచ్ఛ..!!? అని నిలదీస్తున్నారు. న్యాయం కావాలి...!! న్యాయం మారాలి..!! అని నినదిస్తున్నారు.









