Spirituality

Spirituality: కామం-క్రోధం దుర్గుణాలా?.. దైవశక్తులా?..

రచన: Venu7 నిమిషాల పఠనం

మనిషి గొప్పతనం అతనిలో కోపం లేకపోవడంలో లేదు.. కోపం ఉన్నా ధర్మాన్ని ఎంచుకోవడంలో ఉంది.. కోరికలు లేకపోవడంలో కాదు.. కోరికల మధ్య కూడా వివేకాన్ని కోల్పోకపోవడంలో ఉంది..

మన ధర్మగ్రంథాలలో ఉన్న అంతర్యాన్ని లోతుగా గమనిస్తే.. ఒక అద్భుతమైన సత్యం బోధపడుతుంది. చిన్ననాటి నుండి మనం వింటున్న కామక్రోధాలు కేవలం మనల్ని పతనం చేసే శత్రువులు మాత్రమే కావు.. అవి మన అంతరంగంలో దాగివున్న అపరిమితమైన ప్రచండ శక్తులు.. సృష్టిలోని ప్రతి భావన వెనుక ఒక దివ్యమైన ప్రయోజనం దాగి ఉంది. ఆ శక్తిని ఎలా నియంత్రిస్తున్నాం, ఏ దిశగా నడిపిస్తున్నాం అనేదే మన జీవిత పరమార్థాన్ని నిర్దేశిస్తుందని ఇవి తెలియజేస్తాయి..

ఇక కామం, క్రోధం శత్రువులు కావు వాటిపై మనకు నియంత్రణ లేకపోవడమే అసలు శత్రువు అని శాస్త్రాలు భోధిస్తున్నాయి.. కామం అంటే కేవలం ఇంద్రియ కోరిక కాదు. ఏదైనా సాధించాలనే ఆకాంక్ష కూడా కామమే.. జ్ఞానం పొందాలనే కోరిక కావచ్చు.. ధర్మాన్ని ఆచరించాలనే తపన కావచ్చు.. సమాజానికి మేలు చేయాలనే సంకల్పం కావచ్చు.. అందుకే కోరికకు వివేకం తోడైతే అది లక్ష్యంగా కూడా మారుతుందని చెబుతారు..

కానీ అదే కోరికకు హద్దులు లేకపోతే.. అది వ్యామోహంగా మారుతుంది. వ్యామోహం పెరిగినప్పుడు విచక్షణ తగ్గుతుంది. విచక్షణ తగ్గిన చోట అధర్మం ప్రవేశిస్తుందని ఆథ్యాత్మిక గ్రంధాలు భోధిస్తాయి.. ఇక క్రోధం కూడా అంతే.. అన్యాయం జరిగినప్పుడు మనలో కలిగే ఆగ్రహం మనలోని ధర్మచైతన్యాన్ని మేల్కొలపవచ్చు.. బలహీనుడిపై దౌర్జన్యం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ధైర్యం కావాలి. అన్యాయం ఎదురైనప్పుడు నిలబడే శక్తి కావాలి. కానీ ఆ ఆగ్రహం వ్యక్తిగత ద్వేషంగా మారకూడదు. ఎందుకంటే...

ధర్మం కోసం పుట్టిన కోపం రక్షణగా మారుతుంది. అహంకారం నుంచి పుట్టిన కోపం విధ్వంసంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. మన పెద్దలు చెప్పిన సర్పం కథలోని నీతి కూడా ఇదే.. ఒక మహర్షి ఎవ్వరినీ కాటు వేయవద్దని సర్పానికి చెప్పాడు. సర్పం ఆ మాట విని పూర్తిగా మౌనమైపోయింది. అందరూ దానిని బలహీనంగా భావించి రాళ్లతో కొట్టడం ప్రారంభించారు.. దీంతో అది మహర్షిని ఆశ్రయించగా అప్పుడు ఆ మహర్షి నిన్ను కాటువేయవద్దని చెప్పాను కానీ బుసకొట్టవద్దని చెప్పలేదుగా అని అంటాడు..

ఈ ఒక్క మాటలో గొప్ప జీవన తత్వం ఉంది.. అహింస అంటే బలహీనత కాదు. సహనం అంటే చేతకానితనం కాదు.. నిగ్రహం అంటే మన శక్తిని కోల్పోవడం కాదు. మన శక్తి మన ఆధీనంలో ఉండటం అనే అర్థాన్ని సూచిస్తాయి.. మన పురాణాలలో కూడా ధర్మరక్షణ కోసం దైవం ఉగ్రరూపాలను ధరించిన సందర్భాలు కనిపిస్తాయి. నరసింహ స్వరూపం అయినా... దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన ఘట్టం అయినా... ఆ ఉగ్రత్వం వ్యక్తిగత ద్వేషానికి ప్రతీక కాదని తెలియచేస్తుంది..

అది అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా చెబుతారు.. అందుకే నిజమైన సాధకుడు కోపం రాకుండా ఉండాలని మాత్రమే ప్రయత్నించడు. కోపం వచ్చినా... దానికి తానే అధిపతిగా ఉండటాన్ని నేర్చుకుంటాడు.. కోపం మనల్ని నడిపిస్తే అది బంధనం.. మనమే కోపాన్ని నడిపిస్తే.. అదే శక్తి.. ఇలా కోపాన్ని, కామాన్ని స్వార్థం కోసం కాకుండా, వివేకంతో నియంత్రించి లోకకళ్యాణానికి, ధర్మరక్షణకు శక్తులుగా మలచుకున్న పుణ్యపురుషులు, మహర్షులు మన భారతీయ సంస్కృతిలో ఎందరో ఉన్నారు. వారిలో శ్రీ రమణ మహర్షి, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ ఆదిశంకరాచార్యుల బాటలో నడిచిన ఎందరో యుగపురుషులు మన పురాణాలలో కనిపిస్తారు..

కామం విషయంలోనూ ఇదే సత్యం వర్తిస్తుంది. కోరిక మన ప్రయాణానికి ఇంధనం కావాలి... సంకెళ్లు కాకూడదు.. క్రోధం మన చేతిలో ఆయుధంలా ఉండాలి కానీ మనల్ని గాయపరిచే ఆయుధంగా మారకూడదు. అందుకే ఆధ్యాత్మిక మార్గం కామాన్ని, క్రోధాన్ని పూర్తిగా నాశనం చేయమని మాత్రమే చెప్పదు. వాటిని జయించమని చెబుతుంది. వాటికి దిశ చూపమని చెబుతుంది.. వివేకంతో ఉపయోగించమని చెబుతుంది..

మనిషి గొప్పతనం అతనిలో కోపం లేకపోవడంలో లేదు... కోపం ఉన్నా ధర్మాన్ని ఎంచుకోవడంలో ఉంది.. కోరికలు లేకపోవడంలో కాదు... కోరికల మధ్య కూడా వివేకాన్ని కోల్పోకపోవడంలో ఉంది.. చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే... కోపం మన చేతిలో ఉండాలి... మనం కోపం చేతిలో ఉండకూడదు. కోరిక మనలను ముందుకు నడపాలి... మనలను బంధించకూడదు. అప్పుడు కామం బంధనం కాదు... సంకల్పంగా మారుతుంది. క్రోధం విధ్వంసం కాదు... ధర్మరక్షణకు శక్తిగా మారుతుందని వేదాలు చెబుతున్నాయి.. మనలోని శక్తులను నాశనం చేయడం ఆధ్యాత్మికత కాదు... వాటిపై అధికారం సాధించి, వాటిని ధర్మమార్గంలో నడిపించడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని వేదాలు తెలియజేస్తున్నాయి..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Mythic Duality#Calm#Fury#divine powers#life
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి