మనం ఏ కొత్త పని ప్రారంభించినా, ఏ శుభకార్యానికి శ్రీకారం చుట్టినా ముందుగా తలచుకునేది ఆ బొజ్జ గణపయ్యనే! విఘ్నాలను తొలగించి, విజయాన్ని అందించే లంబోదరుడు బుద్ధికి, విచక్షణకు, మహా జ్ఞానానికి ప్రతీక. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను దాటుకుంటూ సన్మార్గంలో ఎలా సాగాలో వినాయకుని రూపం, ఆయన విశిష్టత మనకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి.
వినాయకుడి రూపం వెనుక ఎంతటి ఆధ్యాత్మిక తత్త్వం ఉందో.. ఆయన అవతారాల కథలు అంతకంటే లోతైన సందేశాన్ని అందిస్తాయి. ఇక గణేశుడి అవతారాల గురించి ప్రధానంగా ముద్గల పురాణంలో విశదంగా ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పురాణం గణపతికి సంబంధించిన ఎనిమిది ప్రధాన అవతారాలను వివరిస్తుంది. ప్రతి అవతారం ఒక దుష్టశక్తిని సంహరించడంతో పాటు.. మనిషి అంతరంగంలోని ఒక దుర్గుణాన్ని జయించాల్సిన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుంది.
వక్రతుండ అవతారం మాత్సర్యానికి.. అంటే అసూయకు ప్రతీకగా చెప్పబడే మత్సరాసురుడిని జయిస్తుంది. ఇది ఇతరుల అభివృద్ధిని చూసి కలిగే అసూయను విడిచిపెట్టాలని సూచిస్తుంది. ఏకదంత అవతారం మదాన్ని, అంటే గర్వాన్ని జయించే తత్త్వానికి ప్రతీక. మహోదర అవతారం మోహాన్ని తొలగించి వివేకం వైపు నడిపించే దైవశక్తిగా భావిస్తారు.
గజానన అవతారం లోభాన్ని జయించే సందేశాన్ని అందిస్తుంది. లంబోదర అవతారం క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలని బోధిస్తుంది. వికట అవతారం కామం, అదుపులేని కోరికలపై నియంత్రణను సూచిస్తుంది. అలాగే విఘ్నరాజ అవతారం మమకారం, స్వార్థపూరితమైన నాది అనే భావనను అధిగమించే తత్త్వానికి ప్రతీక. చివరిగా ధూమ్రవర్ణ అవతారం అహంకారాన్ని జయించే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది.
ఈ ఎనిమిది అవతారాల వెనుక ఉన్న అసలు భావం.. మనిషి బయట ఉన్న శత్రువులను జయించడం కంటే ముందు తనలోని అసూయ, గర్వం, మోహం, లోభం, క్రోధం, కోరిక, మమకారం, అహంకారాన్ని జయించాలన్నదే అని పురాణాలు చెబుతాయి. అందుకే గణపతి ఆరాధన మనలోని విఘ్నాలను తొలగించి, జ్ఞానం, వివేకం, వినయం వైపు నడిపించమని చేసే ఆత్మసమర్పణ. గణనాథుని అష్టావతారాల అంతరార్థం ఇదే.. మనసును జయిస్తే.. జీవితంలోని విఘ్నాలను జయించినట్టే..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












