తెలంగాణ

Hyderabad: గుంటూరు మస్తాన్ మరో కబ్జా?

రచన: Venu12 నిమిషాల పఠనం

కోర్టులను సైతం తప్పుదారి పట్టించడంలో ఈ ఆరా మస్తాన్ అతనికి అతనే సాటి. ఖానామెట్ సర్వే నెంబర్ 11/33 లో 275 గజాల ప్లాట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా నోటరీ ద్వారా సేల్ డీడ్ అని రాయించుకున్నాడు.

*ఈసారి హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న ప్లాట్స్‌లో దందా?

*దమ్ముంటే అరెస్ట్ చేసి కబ్జాలకు అడ్డుకట్ట వేయండి సీఎం గారు?

- ఫేక్ యూఎల్సీ, ఎల్ఆర్ఎస్‌లను సృష్టించిన ఘనుడు?

- కబ్జా చేసిన ప్లాట్‌లో నిర్మాణం ఆపాలని ఆదేశాలు ఇచ్చినా, ఎవరేం చేయరనే ధీమాతో బరితెగింపు?

- పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు

- 10 ఏండ్ల వరకు శిక్ష పడే క్రిమినల్ కేసుల నమోదు?

- ఎఫ్‌ఐఆర్‌కే 3 రోజుల టైం తీసుకున్న పోలీసులు

- అరెస్ట్ కాకుండా ఎన్నో ఒత్తిళ్లు?

- పొలిటికల్ సర్వేల ముసుగులో నేరస్థుడు ఉంటే అరెస్ట్ చేయలేరా?

- సీఎంకు అత్యంత సన్నిహితుడనని చెప్పుకుంటే ఆధారాలు ఉన్నా ఊపేక్షిస్తారా?

- ఆనాడు మెట్టుగూడ భూముల్లో అధికారులను తప్పుదారి పట్టించి హంగామా?

- ఇంకా ఆ ఐపీఎస్‌ను వెంటాడుతున్న అవినీతి మరకలు?

- కబ్జా చేస్తున్నాడని వార్తలు రాస్తే సొంత పేపర్లో నికార్సైన తెలంగాణ జర్నలిస్టులపై సొల్లు కబుర్లు

- తప్పుడు సమాచారంతో మోసపోయామని జిల్లా రిజిస్ట్రార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు

- ఖానామెట్‌లో ఎండోమెంట్ భూమిలో పాగా వేసేందుకు ప్రయత్నం

- నోటరీ సేల్ డీడ్ అంటూ వాల్యుడేషన్‌తో బురడీ కొట్టించే ప్లాన్

- పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ మాయల మారాఠీ మాటలతో మోసపోకండి అంటూ హెచ్చరిస్తున్న బాధితులు

- సర్వేల ముసుగులో దొంగ పత్రాలతో కబ్జాలు చేస్తున్న ఆరా మస్తాన్‌పై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

తెలంగాణ భూములు ఎలా కబ్జాలు అవుతున్నాయో సీఎం రేవంత్ రెడ్డి నిండు శాషన సభలో చెప్పడం సంచలనం సృష్టించింది. కబ్జాలను అడ్డుకోవడానికి ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ కళ్ల ముందే ఫేక్ పత్రాలతో, సర్టిఫికెట్స్‌తో తప్పుడు సమాచారంతో కబ్జాలు చేస్తున్న భూ బకాసురలను మాత్రం వదిలేస్తున్నారు. ప్రతిదీ రాజకీయంగా వాడుకోకండి సార్. ఇలాంటి క్రిమినల్స్‌ను మొక్కలోనే తొక్కేస్తే, మరొకరు నకిలీ పత్రాలతో సామాన్యుల భూములను కొల్లగొట్టలేరు. పొలిటికల్ పరిచయాలు ఉన్నాయని బరితెగిస్తున్న వారి భరతం పడితేనే బాధితులకు భరోసా ఉంటుంది ముఖ్యమంత్రి గారు. లేదంటే ఆంధ్రా నుంచో, అమెరికా నుంచో వచ్చి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న భూములను కబ్జా చేసి ఆరా మస్తాన్ లాగానే ఇళ్లు కట్టేస్తారు.

అన్ని ఫేక్ పత్రాలే?.. అనుమతులు రద్దయినా కట్టడాలు ఆపలేదు?

సైబరాబాద్ మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు ఆరా మస్తాన్‌పై కేసు నమోదు చేశారు. ఈ నెల 12న కూకట్ పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ ఫిర్యాదుతో బీఎన్ఎస్ సెక్షన్స్ 338, 340(2), 336(3) తో కూడిన ఎఫ్ఐఆర్ (నెం. 1403/2026) నమోదైంది. గుట్టల బేగంపేట్ సర్వే నెంబర్ 32లోని ప్లాట్ నెంబర్ 55తో 240 గజాల భూమి ఉంది. ఖాళీగా కనిపించడంతో నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలను సృష్టించారు. యూఎల్సీ సర్టిఫికెట్ రసీదును తీసుకొచ్చి వేరే ప్లాట్ డాక్యుమెంట్‌తో ప్లాట్ నెంబర్ 55లో నిర్మాణలు చేపట్టారు. 2023లో బీపాస్ ద్వారా అనుమతులు తీసుకున్నారు.

ఒరిజినల్ ఓనర్ సోదరుడు మదన్ మోహన్ అన్ని ఆధారాలతో గత నెల 24న మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే లింకు డ్యాకుమెంట్ హోల్డర్ ప్రమీలమ్మ పేరిట 2011లో యూఎల్సీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఆమె వద్ద నుంచి 18058/2018 డాక్యుమెంట్‌తో మోహన్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. జీవో నెంబర్ 747 / 2008 , సీసీఎల్ఏ హైదరాబాద్ లేఖ నెంబర్ Spl.UC4/569/2010, తేదీలు 19-01-2011, 10-05-2011, జీవో నెంబర్ 592, తేదీ 27-05-2011 ప్రకారం అన్నీ ఉన్నాయి. కానీ ఆరా మస్తాన్ అలియస్ షేక్ మస్తాన్ వేరే సైట్ డ్యాకుమెంట్లు వాడటమే కాకుండా ఫేక్ ఎల్ఆర్ఎస్, యూఎల్సీ మొత్తం చెల్లించినా కేవలం అక్నాలెజ్‌మెంట్ పెట్టి తప్పుదారి పట్టించి అనుమతులు(344062/జీహెచ్ఎంసీ/2011/2023)తీసుకున్నాడు. LRS/8891/CR-11/West Zone/GHMC/2008, తేదీ 26-11-2009న అని ఉంది. ఆ ఎల్ఆర్ఎస్ జీ నరసింహరావు, జీ రత్నకుమారి పేరిట ఉంది. ప్లాట్ నెంబర్ 55కు సంబంధం లేదని సీఎంసీ పేర్కొంది.

ఇది తెలుసుకుని 17-06-2026న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 15-08-2026న అనుమతులు రద్దు చేశారు. అయినా పనులు ఆపకపోవడం, పైగా సీఎం లాంటి దగ్గర వ్యక్తుల పేర్లు వాడుకొని, వాళ్లతో దిగిన ఫోటోలు చూపించి అడ్డురాకుండా ఆఫీసర్స్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన 3 రోజులకు మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. నకిలీ ఎల్ఆర్ఎస్, యూఎల్సీ సర్టిఫికేట్స్, వేరే సైట్ డ్యాకుమెంట్స్‌తో మరో ప్లాట్‌ను కబ్జా చేసి నిర్మించినందుకు తప్పుడు సమాచారంతో భవనం అనుమతులు పొందిన తీరు, అధికారులు నోటీసులు పంపించినా నిర్మాణం చేస్తుండటంతో 338 బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 10 ఏండ్ల వరకు శిక్ష పడవచ్చు. కానీ పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. దీంతో మరిన్ని కబ్జాలు చేయలేరని నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు.

ఖానామెట్‌లోనూ అదే తీరు?.. సెల్ డీడ్‌కు వ్యాలిడేషన్ చేయించుకున్న ఘనుడు?

కోర్టులను సైతం తప్పుదారి పట్టించడంలో ఈ ఆరా మస్తాన్ అతనికి అతనే సాటి. ఖానామెట్ సర్వే నెంబర్ 11/33 లో 275 గజాల ప్లాట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా నోటరీ ద్వారా సేల్ డీడ్ అని రాయించుకున్నాడు. అయితే ఈ డాక్యుమెంట్‌ను 25-07-2025న రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రర్ వద్ద వాల్యుడేషన్ చేయించుకున్నారు. సేల్ డీడ్ పత్రానికి వాల్యుడేషన్‌తో మొత్తం హక్కులు వచ్చాయని, విద్యుత్ శాఖ వాళ్లు మీటర్లు ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. రిట్ నెం. 16583/2026, గతంలో సేల్ డీడ్‌ల ద్వారా ఎవరికైతే ఆర్డర్స్ వచ్చాయో వారిని చూపిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అయితే ఈ ప్లాట్‌కు సౌత్ సైడ్ గుడి ఉంది. నార్త్‌కి ఎన్ని ఫీట్స్ రోడ్డు ఉందో కూడా తెలపలేదు. ఈస్ట్, వెస్ట్ నైబర్స్ అంటూ పేర్కొని దందాకు ప్రయత్నం చేశాడు. అయితే, ఈ భూమి దేవాదాయ శాఖకు చెందుతుందని ఎండోమెంట్ ఇంప్లీడ్ అయినట్లు సమాచారం.

మెట్టుగూడలో కూడా అదే పరిస్థితి?.. హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కౌంటర్‌లో స్పష్టం

రిట్ పిటిషన్ నెంబర్ 31464/2025లో ఫణిందర్ రెడ్డి ప్రతివాదిగా కౌంటర్ దాఖలు చేశారు. జీపీఏ నెంబర్ 347 మోసపూరితమని కౌంటర్‌లో తెలిపారు. ఆ జీపీఏతో 3452/2024,3476/2024 సేల్ డీడ్స్ చేయించుకున్నారని దీంతో ఆయనకు టైటిల్ లేకుండానే సబ్ రిజిస్ట్రర్‌ని తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. బీనా మెహతా, నిషా దోషి, మిథాలి, హార్ధిక్‌తో పాటు షేక్ మస్తాన్, మల్లెంపాటి శ్రీధర్‌లు కుట్రలో పాలుపంచుకున్నారని, అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే, ఆ సేల్ డీడ్స్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదని సివిల్ కోర్టులో తేల్చుకోవాలని హైకోర్టుకు చెప్పారు.

ఐపీఎస్‌కు అవినీతి మరక

గతంలో ఆరా మస్తాన్‌పై స్వేచ్ఛ ‘గుంటూరు మస్తాన్ కబ్జా బాగోతం’ అంటూ వార్తలు ఇచ్చింది. టైటిల్ లేకుండానే నకిలీ జీపీఏలు, అధికారులను మేనేజ్ చేయడానికి కొంతమంది సీఎం దగ్గర వ్యక్తులు అంటూ ఏవీ రెడ్డి నుంచి ఫోన్ చేయించడం, ఆ తర్వాత కింది స్థాయిలో పోలీస్ అధికారులకు డబ్బులు ఆశ చూపించి పొజిషన్ తీసుకోవడం చేశాడు. ఇందులో ఓ ఐపీఎస్ అధికారి ఇరుక్కున్నారు. ఉన్నతాధికారుల వద్ద మంచి పేరును పోగొట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. లోకా యుక్తాలో కేసులు ఎదుర్కొంటున్నారు.

అప్పుడు సత్యాలే వార్తలుగా రాస్తే లేనిపోని సొల్లుతో నికార్సైన తెలంగాణ జర్నలిస్టులపై ఆరా మస్తాన్ కట్టుకథలు వండి వార్పించి వార్తలు రాయించాడు. కాని కబ్జాకోరులు ఎప్పుడైనా బయట పడతారు. హైదరాబాద్‌లో భూ లిటిగేషన్‌తో, పొలిటికల్ పరిచయాలు ఉన్నాయని ఫోటోలు చూపించి కోట్లు సంపాదించాలని చూస్తున్న ఇలాంటి పొలిటికల్ సర్వేయర్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరెస్ట్ చేసి చట్టం ఏంటో చూపిస్తే తప్ప మరో కబ్జాకు పాల్పడడు. అన్నీ వారికే తెలిసినట్లు బిల్డప్ ఇవ్వడం కొద్దిగా అయినా ఆపేస్తాడు. మాయ మాటలు, ముఖ్యమంత్రులు జేబులో ఉన్నట్లు మాట్లాడుతూ తెర వెనుక చేస్తున్న ఇలాంటి భూ దందాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

#Telangana#Hyderabad#land grab#Guntur Mastan#Khanamet
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి