నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్త, ఆమె హత్య కేసు ప్రధాన నిందితుడైన చిత్తరి హరిబాబు(26) హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. హరిబాబును తానే నరికి చంపానని, తన చెల్లెలి హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వైష్ణవి సోదరుడు సంతోష్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. గురువారం మధ్యాహ్నం పట్టపగలు నడిరోడ్డుపై నిందితులు హరిబాబుపై దాడి చేసి కిరాతకంగా నరికి చంపిన కొద్ది గంటల్లోనే సంతోష్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసులకు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. వైష్ణవి హత్య కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు నిజామాబాద్‌లోని ఇంద్రాపూర్‌లో తన తల్లితో కలిసి నివాసముంటూ రాజరాజేంద్ర చౌరస్తాలో మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం తాగునీటి కోసం పక్కనే ఉన్న చాట్‌బండి వద్దకు వెళ్లిన సమయంలో కారులో వచ్చిన దుండగుడు అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కారులో నుంచి దిగిన ఓ వ్యక్తి పదునైన కత్తితో హరిబాబు తలపై కేవలం 10 సెకన్ల వ్యవధిలో 9సార్లు నరకడంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఏడాది మార్చి 16న జగిత్యాల జిల్లా కోరుట్లలో తన భార్య, నాలుగు నెలల గర్భిణి అయిన యూట్యూబర్ వైష్ణవి(19)ని హరిబాబు గొంతు నులిమి కిరాతకంగా హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, తన చెల్లి హత్యకు ప్రభుత్వం, న్యాయస్థానాలు సరైన న్యాయం చేయలేకపోయాయనే ఆగ్రహంతోనే హరిబాబును అంతమొందించానని సంతోష్ వీడియోలో స్పష్టం చేశాడు. ‘నా చెల్లిని చంపిన హరిబాబును నేనే చంపాను, పోలీసులకు లొంగిపోతున్నాను, నాకు శిక్ష పడకుండా ప్రజలు మద్దతుగా నిలవాలి’ అని సంతోష్ ఆ వీడియోలో కోరడం గమనార్హం.
కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ప్రభుత్వాసుపత్రిలో స్వీపర్లుగా పనిచేస్తూ పనిచేసేవారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించి 14 నెలల క్రితం పెళ్లి చేసుకుని వైష్ణవి పుట్టింట్లోనే కాపురం పెట్టారు. వైష్ణవి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కుటుంబంలో ఏకైక ఆడపిల్ల అయిన వైష్ణవి అంటే ఆమె 13మంది సోదరులకు ఎంతో ప్రాణం. ఆమె దారుణ హత్యను జీర్ణించుకోలేక నాడే హరిబాబును శిక్షిస్తామని ప్రతిజ్ఞ బూనిన సోదరులు, అన్నంత పని చేసి హరిబాబును హతమార్చడం కోరుట్ల, నిజామాబాద్ ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ రెండు వరుస హత్యలతో ఇరు కుటుంబాల్లో కోలుకోలేని విషాదం మిగిలింది.












