వినాయక చవితి వేడుకలు అంటే భక్తి, సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు నగరమంతా వెలుగులతో కళకళలాడే సమయం. ఈ ఉత్సవాల్లో గణేష్ మండపాలకు విద్యుత్ ఖర్చు నిర్వాహకులకు భారం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీజీఎస్పీడీసీఎల్‌కు చెందిన 9 సర్కిళ్లలో ఇప్పటివరకు 17,348 తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఈ మండపాల ద్వారా నమోదైన విద్యుత్ లోడ్ 51.72 మెగావాట్లుగా ఉంది. వీటికి సంబంధించి విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీల రూపంలో ఇప్పటివరకు 8 కోట్ల 18 లక్షల 9 వేల 482 రూపాయల మేర బిల్లు నమోదైంది. అయితే ఈ మొత్తాన్ని మండప నిర్వాహకులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
ఇది ఒక్క ఏడాదికే పరిమితమైన నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మొదటిసారిగా 2025 ఆగస్టులో ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. 2026 సంవత్సరం కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఈ ఏడాది ఉత్సవాలతో పాటు నిమజ్జనోత్సవాల సమయంలోనూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అన్ని సర్కిళ్లలో ఇంజినీర్లు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ప్రజా ప్రభుత్వం విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగిస్తుంది. అయితే ఉచిత విద్యుత్ సదుపాయం పొందాలంటే సంబంధిత అనుమతులు తీసుకోవడం, నిబంధనలు పాటించడం తప్పనిసరి..










