తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్ములా ఈ-రేసు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కోర్టుకు హాజరుకావడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కాసేపట్లో విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఇక గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టేందుకు ఫార్ములా ఈ-రేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేసు నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయంటూ దర్యాప్తు వేగవంతం చేసింది. 2024 డిసెంబర్‌లో ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్‌ను ఏ-1గా చేర్చడం ఈ వివాదాన్ని మలుపు తిప్పింది.
హెచ్‌ఎండీఏ నుంచి నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 55 కోట్ల రూపాయల నిధులను ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు బదిలీ చేశారని, ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది. అయితే, ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన అభివృద్ధి ముద్రను చెరిపివేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీని అస్త్రంగా వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి.
ఇక 2023 జూలైలోనే కేటీఆర్ ఏసీబీ కోర్టుకు హాజరైన విషయాన్ని గుర్తుచేస్తూ... ఎన్నిసార్లు విచారణకు పిలిచినా చట్టపరంగానే ఎదుర్కొంటామని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ఎలాంటి రాజకీయ కక్షసాధింపు కాదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని స్పష్టం చేస్తోంది. 55 కోట్ల రూపాయల ప్రజాధనం ఏ ప్రాతిపదికన బదిలీ అయిందనే దానికి కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబడుతోంది.
గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వేగంగా మారుతున్న ఏసీబీ దర్యాప్తు పరిణామాలు... మొత్తం తెలంగాణ రాజకీయాలనే హీటెక్కిస్తున్నాయి. న్యాయస్థానంలో జరుగుతున్న ఈ విచారణ కేవలం ఒక లీగల్ పోరాటంగా మాత్రమే కాకుండా... కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ రాజకీయ సమరంగా మారింది. ఇక ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి..









