తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల (JNV) ఏర్పాటు, హిందీ భాష బోధనపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు గడ్డపై హిందీని నేర్పించకూడదనే పట్టుదలను విడనాడాలని, రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవాలని ధర్మాసనం హితవు పలికింది. ప్రతీ జిల్లాలో నవోదయ పాఠశాలల స్థాపనకు భూమిని గురించాలంటూ 2025 డిసెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌ను రద్దు చేయడానికి కోర్టు నిరాకరించింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తమిళనాడులో అమలులో ఉన్న రెండు భాషల విధానానికి (Two-language policy) భిన్నంగా నవోదయ విద్యాలయాల్లో హిందీతో కూడిన మూడు భాషల విధానం (Three-language policy) ఉంటుందని రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ నుంచి కొత్త విద్యా సంస్థలు రావడం వల్ల చెన్నై విద్యా ప్రమాణాలు తగ్గుముఖం పట్టవని, తమిళనాడులోని విద్యార్థులకు ఇవి మరింత అదనపు అవకాశాలను అందిస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాష్ట్రాల విద్యా స్వయంప్రతిపత్తి సహకార సమాఖ్య విధానం (Cooperative Federalism) భావనను గుర్తుచేసిన కోర్టు, కేంద్రం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చలు జరిపి ఈ భాషా వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. అవసరమైతే నవోదయ విద్యాలయాల్లో తమిళాన్ని రెండో భాషగా పొందుపరిచే అంశాన్ని కూడా కేంద్రంతో మాట్లాడాలని తెలిపింది.
నవోదయ పాఠశాలల నిర్మాణం కోసం తక్షణమే భూసేకరణ చేపట్టాల్సిన అవసరం లేదని, కేవలం స్థలాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు నెలల వ్యవధి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కేంద్ర-రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించి తదుపరి నివేదికను అందించాలని ఆదేశిస్తూ, కేసు విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.












