ఒక వైపు ధర చూస్తే లక్షల మాటే. మరోవైపు స్టోర్ తెరిచేది ఉదయం 8గంటలకైతే, జనాలు మాత్రం ముందు రోజు రాత్రి నుంచే క్యూ లైన్లలో నిలబడుతున్నారు. సాధారణంగా ఏదైనా పండుగ లేదా జాతర ఉంటేనే జనంతో కిక్కిరిసిన దృశ్యాలు కనిపిస్తాయి. కానీ, యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా అదొక పెద్ద వేడుకలా మారిపోతుంది. ‘కొంటే ఐఫోనే కొనాలి, అది కూడా అమ్మకానికి వచ్చిన రోజే చేతిలో పడాలి’ అనే ఐ ఫోన్ లవర్స్ ముందు ఈ ధరలు, గంటల తరబడి నిరీక్షణలు చిన్నవిగా మారిపోయాయి.
తిండి, నిద్ర పక్కనబెట్టి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి మరీ యాపిల్ రిటైల్ అవుట్‌లెట్ల ముందు గంటల కొద్దీ పడికాపులు కాస్తున్నారంటే.. జనాల్లో ఐఫోన్ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్క రాష్ట్రాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి మరి, తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు గంటల తరబడి భారీ క్యూలైన్లలో నిలబడి ఐఫోన్‌ను దక్కించుకోవడానికి పోటీపడటం యాపిల్‌పై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
భారత మార్కెట్‌లో యాపిల్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) విక్రయాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ అధికారిక రిటైల్ స్టోర్ల వద్ద కస్టమర్లు భారీగా క్యూ కట్టారు. ముంబై, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో సరికొత్త ఐఫోన్‌ను దక్కించుకోవడానికి కొందరు అభిమానులు తెల్లవారుజాము నుంచే దాదాపు 10 నుంచి 12 గంటల పాటు నిరీక్షించడం విశేషం.
బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ ఉదయం 5 గంటలకే స్టోర్‌కు చేరుకుని క్యూలో నిల్చోగా, నోయిడాలో ఓ వ్యక్తి ఉదయం 6గంటల నుంచి వేచి చూసి మొదటి ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతీ ఏడాది ఐఫోన్ లాంచ్‌ను ఒక పండుగలా భావిస్తామని కొనుగోలుదారులు తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ విక్రయాలు అందుబాటులోకి వచ్చాయి.
సాంకేతిక వివరాల్లోకి వెళ్తే, ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో వేరియబుల్ అపెర్చర్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, కొత్త ప్రొఫెషనల్ కెమెరా కంట్రోల్స్ అమర్చారు. అత్యంత వేగవంతమైన A20 ప్రో చిప్‌సెట్, మెరుగైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో అందించారు. ఈ మోడళ్లు బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బర్గండీ రంగుల్లో లభిస్తున్నాయి. ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ.1,64,900 కాగా, ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,79,900గా నిర్ణయించారు. గరిష్ఠంగా 2TB మోడల్ ధర రూ.3.29 లక్షల వరకు ఉంది.
ఈ విక్రయాలతో పాటు యాపిల్ తన నూతన ఉత్పత్తులైన ఎయిర్‌పాడ్స్ 5, యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ ఆల్ట్రా 4 మోడళ్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా, సంస్థ తొలిసారిగా రూపొందించిన మడతబెట్టే ఫోన్ 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo)ను కూడా ప్రకటించింది. భారత్‌లో రూ.2,99,900 ప్రారంభ ధర కలిగిన ఈ ఫోల్డబుల్ ఫోన్ ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 23 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.








