ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టిందంటూ రేవంత్‌రెడ్డి తన అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు రాయించారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ.. ‘కేవలం వేయి కోట్లు ఇచ్చి ఆ లక్ష కోట్ల ఆస్తులన్నింటినీ రేవంత్ రెడ్డి తీసుకోమని, మిగిలిన 99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని’ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే ఉద్దేశంతోనే తాము ఫార్ములా-ఈ (Formula E) రేసింగ్‌ను నగరానికి తీసుకువచ్చామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. అయితే, ఈ ఈవెంట్‌లో ఏదో అక్రమం జరిగిపోయిందనే సాకుతో రేవంత్ ప్రభుత్వం దానిని రద్దు చేయడమే కాకుండా, తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ మోటార్ రేసింగ్ ఈవెంట్, పెట్టుబడుల కోసం లండన్ దాకా వెళ్లారని, కానీ తాము అంతర్జాతీయ ఈవెంట్ తెస్తే రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
న్యాయస్థానాలు, దేశ న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే చట్టాన్ని గౌరవిస్తూ రెండోసారి కూడా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యానని, భవిష్యత్తులో విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కోర్టుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయపోరాటంలో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
22A భూముల పేరుతో 30 శాతం కమీషన్ల దందా
రాష్ట్రంలో భూములను 22A జాబితాలో పెట్టి, దాదాపు 30 శాతం కమీషన్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద నాటకానికి తెరతీసిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ అక్రమాలను రాష్ట్ర ప్రజలు ఇప్పటికే స్పష్టంగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈ భూ దందాల నుంచి, ప్రభుత్వ విఫలాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తనపై ఇలాంటి చిల్లర కేసులు పెడుతూ కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.









