తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో చిక్కుకున్న భూముల సమస్యలను శాశ్వతంగా తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిబంధనల పేరుతో భూ యజమానులు అనుభవిస్తున్న నరకయాతనకు ముగింపు పలుకుతూ, క్షేత్రస్థాయి విజ్ఞప్తులను పరిశీలించేందుకు గాను ముగ్గురు ఉన్నతాధికారుల నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఆదేశాలు ఇచ్చింది.
ఈ ప్రత్యేకాధికారుల కమిటీకి సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ సారథ్యం వహించనుండగా, లా సెక్రటరీ పాపిరెడ్డితో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు. ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉండిపోయిన ప్రైవేటు భూములు, దరఖాస్తుల్లోని సాంకేతిక లోపాలు, భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ కమిటీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించనుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనల అనంతరం, నిర్ణీత గడువులోగా నివేదికను రూపొందించే దిశగా యంత్రాంగం వేగం పెంచింది.
నిషేధం వల్ల ఆస్తుల క్రయవిక్రయాలు, బ్యాంక్ రుణాలు కాక సతమతమవుతున్న వేలాది మంది నిజమైన యజమానుల ఆర్జీలకు ఈ నిర్ణయంతో తగిన న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. భూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్ది అర్హులైన వారికి ఊరట నిచ్చేందుకు ఈ నిపుణుల బృందం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. పారదర్శక విధానాల ద్వారా వివాదాలను పరిష్కరించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో నిషేధిత జాబితా ఉచ్చులో చిక్కుకుని, కష్టపడి కొనుక్కున్న సొంత భూమిపై ఎలాంటి హక్కులూ లేక అల్లాడుతున్న లక్షలాది మంది సామాన్యులకు పెద్ద ఊరట లభించనుంది. రిజిస్ట్రేషన్లు కాక, అత్యవసర సమయాల్లో ఆస్తులు అమ్ముకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక తీవ్ర మానసిక ఆందోళన అనుభవిస్తున్న బాధితుల సమస్యలకు ఈ కమిటీతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నివేదిక సమర్పించి, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని భూ యజమానులు, రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశానికి సంబంధించి 'స్వేచ్ఛ' దినపత్రిక వరుస పరిశోధనాత్మక కథనాలను ప్రచురించి, బాధితుల గోడును వరుసగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. నిషేధిత భూముల పేరుతో సామాన్యులు అనుభవిస్తున్న నరకయాతనను, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వచ్చిన కథనాలు క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బాధితుల ఆవేదనకు అద్దం పడుతూ స్వేచ్ఛ ప్రచురించిన ఈ వరుస కథనాలకు విస్తృత స్పందన లభించడమే కాకుండా, చివరికి పాలకుల్లోనూ కదలిక తెచ్చాయి. పత్రిక సుదీర్ఘంగా చేపట్టిన ఈ కథనాల ప్రభావంతోనే సర్కార్ నిద్రమత్తు వీడి, సమస్య పరిష్కారానికి ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.











