తెలంగాణ

అసెంబ్లీలో జీరో అవర్‌కు విలువే లేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ శాసనసభలో జీరో అవర్ (Zero Hour) నిర్వహణ తీరుపై, అలాగే ఇందిరమ్మ ఇళ్ల టాయింపులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు లేవనెత్తుతున్న సమస్యలకు ఏమాత్రం విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ శాసనసభలో జీరో అవర్ (Zero Hour) నిర్వహణ తీరుపై, అలాగే ఇందిరమ్మ ఇళ్ల టాయింపులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు లేవనెత్తుతున్న సమస్యలకు ఏమాత్రం విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ‘నోట్ చేసుకుంటున్నాం’ అని మంత్రులు చెబుతున్నారే తప్ప, ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదని ఆయన బాహాటంగానే విమర్శించారు.

అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో అధికారుల తీరుపై దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంఐఎం (MIM) ఎమ్మెల్యేలను చూస్తే ప్రభుత్వ అధికారులు భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ప్రజాప్రతినిధులు తిడతారనే భయంతో అధికారులు ఇందిరమ్మ ఇళ్లను వారికే కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల ఎంపికకు నిర్వహించే డ్రా ప్రక్రియలో అధికారులు ప్రజాప్రతినిధులమైన తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, కేవలం ఎంఐఎం నేతల ఒత్తిళ్లకే లొంగిపోతున్నారని ఆరోపించారు.

తన నియోజకవర్గానికి కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను అధికారులు వేరే నియోజకవర్గం వారికి అక్రమంగా కేటాయించారని దానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు దక్కాల్సిన ఇళ్లను పక్కదారి పట్టించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విచారకరమైన వ్యవహారాన్ని బాధ్యతాయుతమైన మంత్రి దృష్టికి తీసుకువెళ్తే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి ‘కూల్, కూల్’ అని తేలికగా సమాధానమిస్తూ దాటవేస్తున్నారని సభ వెలుపల అసహనం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ప్రాధాన్యతను తగ్గించడం, ఇళ్ల కేటాయింపుల్లో పక్షపాత వైఖరి ప్రదర్శించడంపై సొంత వర్గం నుంచే విమర్శలు రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పారదర్శకంగా జరగడం లేదనడానికి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలే ప్రత్యక్ష నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#DanamNagender#TelanganaAssembly#ZeroHour#IndirammaIndlu#MIM#TelanganaPolitics#CongressVsMIM#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి