క్రైమ్

Chevella: లాటరీ పేరుతో కొత్త స్కెచ్.. ట్యాక్స్‌లు, జీఎస్టీ అంటూ మోసం!

రచన: Venu4 నిమిషాల పఠనం

చేవెళ్ల మండలం తంగడిపల్లి రెవెన్యూ పరిధిలోని మడికట్టుకు చెందిన దేవరి మల్లేశం కూడా ఇలాంటి సైబర్ మోసానికి బలయ్యారు. జులై 10న గుర్తుతెలియని వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి.. తాము కేరళ లాటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, మీకు రూ.8 లక్షల లాటరీ వచ్చిందని నమ్మించాడు.

మోసగాళ్లు రోజురోజుకూ తమ పద్ధతులను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు.. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, లాటరీ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ ఎంతో నమ్మకంగా మాట్లాడుతున్నారు. బాధితుడి నమ్మకాన్ని సంపాదించి, దశలవారీగా డబ్బులు వసూలు చేయడమే వారి కొత్త వ్యూహంగా మారుతోంది.

చేవెళ్ల మండలం తంగడిపల్లి రెవెన్యూ పరిధిలోని మడికట్టుకు చెందిన దేవరి మల్లేశం కూడా ఇలాంటి సైబర్ మోసానికి బలయ్యారు. జులై 10న గుర్తుతెలియని వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి.. తాము కేరళ లాటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, మీకు రూ.8 లక్షల లాటరీ వచ్చిందని నమ్మించాడు. లాటరీ డబ్బులు పొందాలంటే బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు పంపాలని చెప్పడంతో.. మల్లేశం వాటిని వాట్సాప్ ద్వారా పంపించారు.

తర్వాత లాటరీ డబ్బులు విడుదల చేయాలంటే ప్రాసెసింగ్ ట్యాక్స్, నగదు బదిలీ చార్జీలు, జీఎస్టీ, ఎన్‌ఓసీ, కోర్టు అగ్రిమెంట్, నెఫ్ట్ చార్జీలు, టీడీఎస్, ఈ-స్టాంప్ పేపర్ అంటూ ఒక్కో కారణం చెబుతూ పదేపదే డబ్బులు అడిగారు. లాటరీ డబ్బులు వస్తాయన్న ఆశతో మల్లేశం విడతల వారీగా ఏకంగా రూ.7,47,468 పంపించారు. కానీ చివరకు అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు జులై 31న సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ ఫిర్యాదు రశీదును చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో అందజేశారు. ఇక ఈ మధ్య సైబర్ నేరగాళ్లు పన్నులు, ప్రభుత్వ నిబంధనలు, బ్యాంకింగ్ ప్రక్రియలు అంటూ నమ్మదగిన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా లాటరీ గెలిచామని చెప్పి ముందుగా పన్ను, ఫీజు, ప్రాసెసింగ్ చార్జీ చెల్లించమని అడిగితే అప్రమత్తం కావాలి. తెలియని వ్యక్తులకు ఆధార్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పిన్‌లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పంపకూడదు. అనుమానం వచ్చిన వెంటనే డబ్బు పంపకుండా, 1930కు ఫిర్యాదు చేయడం ద్వారా మోసాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

#Chevella#Tangadipalli#Madikattu#lottery fraud#taxes#GST
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి