Health

Health: షుగర్ కంట్రోల్ కోసం 16/8 ఫాస్టింగ్.. టైప్-1 డయాబెటిస్‌లో ఎంతవరకు సేఫ్?..

రచన: Venu4 నిమిషాల పఠనం

నేటి జీవనశైలిలో ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు వంటి కారణాలతో డయాబెటిస్ సమస్యపై ఆందోళన పెరుగుతోంది. అయితే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారి విషయంలో ఆహారం, ఇన్సులిన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడం మరింత కీలకం.

నేటి జీవనశైలిలో ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు వంటి కారణాలతో డయాబెటిస్ సమస్యపై ఆందోళన పెరుగుతోంది. అయితే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారి విషయంలో ఆహారం, ఇన్సులిన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడం మరింత కీలకం. ఈ నేపథ్యంలో టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేయవచ్చా అనే అంశంపై తాజాగా జరిగిన ఒక చిన్న అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఆరు నెలల పాటు 32 మంది టైప్-1 డయాబెటిస్ బాధితులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, కొంతమంది రోజులో 8 గంటల సమయంలో మాత్రమే ఆహారం తీసుకునే టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ విధానాన్ని పాటించారు. అంటే దాదాపు 16 గంటల పాటు ఉపవాసం ఉండే విధానం. ఆరు నెలల తర్వాత ఈ విధానాన్ని పాటించిన వారిలో HbA1c సగటున సుమారు 0.46 శాతం పాయింట్లు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే మొత్తం ఇన్సులిన్ అవసరం, సగటు గ్లూకోజ్ స్థాయిల్లో గణనీయమైన మార్పు కనిపించలేదు.

అదే సమయంలో ఈ చిన్న అధ్యయనంలో తీవ్రమైన హైపోగ్లైసీమియా, హైపర్‌గ్లైసీమియా లేదా డయాబెటిక్ కీటోయాసిడోసిస్ పెరిగినట్లు గుర్తించలేదు. అయితే దీనిని చూసి టైప్-1 డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరూ సొంతంగా 16/8 ఫాస్టింగ్ ప్రారంభించడం మాత్రం సురక్షితం కాదు. ఎందుకంటే టైప్-1 డయాబెటిస్‌లో శరీరానికి ఇన్సులిన్ తప్పనిసరిగా అవసరం. ఉపవాస సమయంలో ఇన్సులిన్ మోతాదులో మార్పులు చేయడం లేదా ఆహారం తీసుకోకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల కొందరిలో రక్తంలో చక్కెర తగ్గడం, పెరగడం, కీటోన్లు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ కీటోయాసిడోసిస్ ప్రాణాపాయ పరిస్థితిగా మారవచ్చు.

అందుకే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే ముందుగా ఎండోక్రినాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఇన్సులిన్ మోతాదు, గ్లూకోజ్ స్థాయిలు, కీటోన్ పరీక్షలు, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వైద్యుల పర్యవేక్షణలో నిర్ణయం తీసుకోవాలి. ఈ అధ్యయనం ఆశాజనకమైన ఫలితాలను చూపించినప్పటికీ, కేవలం 32 మందితో జరిగిన చిన్న పరిశోధన కావడంతో దీనిని అందరికీ వర్తించే నిర్ధారిత చికిత్సగా భావించకూడదని నిపుణులు అంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Fasting#Blood Sugar#Control#Diabetes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి