భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు? నిజంగా ఉన్నాడా? లేక మన ఊహలో మాత్రమేనా? ఈ ప్రశ్న ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి మనసులో మెదులుతుంది. కానీ ఈ విశ్వాన్ని నడిపించే పరమశక్తిని సాధారణ కళ్లతో చూడడం అంత సులభం కాదు. భగవంతుడికి ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు, ఒకే పేరు లేదు. అయితే ఈ సమస్త సృష్టికి మూలకారణం మాత్రం ఆ పరబ్రహ్మమే అని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చెబుతున్నాయి.
ఎందరో మహర్షులు, యోగులు, జ్ఞానులు ధ్యానం, తపస్సు, ఏకాగ్రత ద్వారా ఆ పరమాత్మను అనుభవించినట్లు మన పురాణాలు వివరిస్తాయి. అయితే కలియుగంలో అందరికీ సులభమైన మార్గం ఏదైనా ఉంటే అది భక్తి మార్గం... కానీ హృదయపూర్వకమైన భక్తి ఉంటేనే భగవంతుడు భక్తునికి తాను కోరుకున్న రూపంలోనే దర్శనమిస్తాడని హైందవుల విశ్వాసం.. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు.
ప్రతి జీవిలోనూ భగవంతుని దర్శించడం, సమత్వబుద్ధితో అందరినీ చూడడం, విశాల హృదయాన్ని అలవర్చుకోవడం. భక్తి సామ్రాజ్యంలో అడుగుపెట్టినవారికి ఈ జగత్తంతా జగన్నాథుడి స్వరూపంగానే కనిపిస్తుంది. వారికి భగవంతుడు లేని స్థలం ఉండదు, దైవత్వం లేని జీవి ఉండదు. మన పురాణాలు అలాంటి మహాభక్తుల జీవితాలతో నిండి ఉన్నాయి. బెజ్జ మహాదేవి పరమేశ్వరుడిని తన చిన్నబిడ్డగా భావించి ప్రేమతో పెంచింది.
రామకృష్ణ పరమహంస తన జీవితాన్నంతా కాళికామాత పాదాలకు అంకితం చేశాడు. తన భార్యలో కూడా ఆది పరాశక్తినే దర్శించాడు. ఆ దివ్యానుభూతే ఆయనను మహాయోగిగా నిలబెట్టింది. అలాగే మట్టితో కుండలు చేసి జీవించే ఒక సాధారణ కుమ్మరి, తాను తిరుమలకు వెళ్లలేక పోతున్నాననే బాధతో మట్టితో శ్రీహరిని మలిచి పూజించేవాడు. అతని అమాయకమైన భక్తికి మెచ్చిన శ్రీహరి స్వయంగా అతని వద్దకు వచ్చాడని వేంకటేశ్వర మహాత్మ్యం చెబుతుంది.
పుండరీకుడి కథ కూడా మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మొదట జీవితాన్ని వ్యర్థంగా గడిపిన అతడు, తర్వాత తల్లిదండ్రులే పరమాత్మ స్వరూపమని గ్రహించి వారికి అంకితభావంతో సేవ చేశాడు. అతని భక్తికి ముగ్ధుడైన పాండురంగుడు స్వయంగా వచ్చి, తన భక్తుని కోసం వేచి నిలిచాడని పాండురంగ మహాత్మ్యం చెబుతోంది. అట్లానే యోగానంద, యుక్తేశ్వరస్వామి, బాబాజీ ఇలా ఎందరో మహాత్ములు భగవంతుని తాము కళ్లారా చూచినట్లు పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి.
భగవంతుని చేరుకోవడానికి మరో గొప్ప మార్గం భాగవతుల సేవ. భక్తులను సేవించడం భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది. నారద మహర్షి కూడా మహాభాగవతుల అనుగ్రహంతోనే నారాయణ మంత్రాన్ని పొందాడు. నిరంతరం "నారాయణ... నారాయణ..." అనే నామస్మరణతో మూడు లోకాలలో సంచరించే మహాభక్తుడిగా నిలిచాడు.
చివరగా ఒక గొప్ప సత్యం... భగవంతుడిని చూడాలంటే ముందుగా మన దృష్టి మారాలి. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడగల సమత్వబుద్ధి రావాలి. అహంకారం తొలగి, ప్రేమ పెరగాలి. సేవాభావం అలవడాలి. అప్పుడు భక్తుడికీ, భగవంతుడికీ మధ్య ఎలాంటి భేదం ఉండదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో గురువు స్థానం అత్యున్నతమైనది. గురువు అనుగ్రహం లభిస్తే, దైవతత్వాన్ని తెలుసుకునే మార్గం సులభమవుతుంది. అందుకే శాస్త్రాలు గురువును త్రిమూర్తుల స్వరూపంగా వర్ణించాయి.
కాబట్టి... భగవంతుడిని వెతకడానికి ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం లేదు. మన హృదయంలో భక్తిని నింపండి... ప్రతి జీవిలో దైవత్వాన్ని దర్శించండి... గురువు బోధించిన సన్మార్గంలో నడవండి. అప్పుడు భగవంతుడు ఎక్కడో కాదు... మీలోనే ఉన్నాడనే పరమసత్యాన్ని స్వయంగా అనుభవిస్తారు.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












