International

శాంసంగ్ ఉద్యోగులకు బిగ్ షాక్.. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత

రచన: NK6 నిమిషాల పఠనం

ఇటీవలి కాలంలో 30 మందికి పైగా ఉద్యోగులు తాము ఉద్యోగాలు కోల్పోయామని లేదా శాంసంగ్‌ను విడిచిపెట్టామని బహిరంగంగా చెప్పినట్లు లింక్డ్ఇన్ పోస్టులు చూపిస్తున్నాయి. ఆ ఉద్యోగులలో టెక్సాస్, న్యూజెర్సీ, అమెరికాలోని మరికొన్ని ప్రాంతాలకు చెందిన సీనియర్ సేల్స్, మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు.

Samsung Job Cuts: శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. భారీగా ఉద్యోగాల కోత ప్రకటించింది. యూఎస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఉద్యోగాలను తగ్గించింది శాంసంగ్. దీని వల్ల డిస్‌ప్లే, మొబైల్ ఫోన్, ఇతర కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలోని ఉద్యోగులపై ఎఫెక్ట్ పడింది. ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా న్యూజెర్సీ, టెక్సాస్‌లోని ఉద్యోగులను ప్రభావితం చేశాయి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాలో తన కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో శాంసంగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాన్ని నిర్వహించే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (SEA), తన ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీ నుండి టెక్సాస్‌కు తరలిస్తోంది. ఈ ప్రధాన కార్యాలయం తరలింపు కారణంగా న్యూజెర్సీలోని ఎంగిల్‌వుడ్ క్లిఫ్స్‌లో 739 ఉద్యోగులపై ప్రభావం పడింది. టెక్సాస్ కు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినా.. అందుకు ఆసక్తి చూపని ఉద్యోగులను తొలగించినట్లు శాంసంగ్ ధృవీకరించింది. అంతేకాదు టెక్సాస్‌లోని ప్లానో కార్యాలయంలో మొబైల్ విభాగంలో సుమారు 100 మంది ఉద్యోగులను కూడా తొలగించినట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో 30 మందికి పైగా ఉద్యోగులు తాము ఉద్యోగాలు కోల్పోయామని లేదా శాంసంగ్‌ను విడిచిపెట్టామని బహిరంగంగా చెప్పినట్లు లింక్డ్ఇన్ పోస్టులు చూపిస్తున్నాయి. ఆ ఉద్యోగుల్లో టెక్సాస్, న్యూజెర్సీ, అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన సీనియర్ సేల్స్, మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు.

ప్రధాన కార్యాలయం తరలింపు వల్ల తమ ఉద్యోగుల సంఖ్యలో మార్పులు రావచ్చని శాంసంగ్ తెలిపింది. అలాగే కొన్ని ఉద్యోగ విధులను పునర్వ్యవస్థీకరిస్తున్నారని వెల్లడించింది. ఈ మార్పులు తమ వ్యాపార ప్రాధాన్యతలకు మరింత అనుగుణంగా ఉండేందుకేనని శాంసంగ్ తెలిపింది.

"వేర్వేరు బృందాలను ఒకే చోటుకి తీసుకురావడం ద్వారా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు, మెరుగైన సహకార వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఏఐ ఎకో సిస్టమ్‌లో భాగం కావాలనే లక్ష్యంతోనే టెక్సాస్‌కు మారుతున్నాం" అని శాంసంగ్ వివరించింది. ఇది ప్రపంచవ్యాప్త పునర్‌వ్యవస్థీకరణ కాదని, కేవలం అమెరికాలోని కార్యకలాపాలను ప్రస్తుత వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చడమేనని స్పష్టం చేసింది.

AI చిప్‌లకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా శామ్‌సంగ్ చిప్ విభాగం అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. అదే సమయంలో, చిప్‌ల ధరలు గణనీయంగా పెరగడం వల్ల శామ్‌సంగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ప్రధానంగా AI-ఆధారిత చిప్ డిమాండ్ కారణంగా, గత ఏడాదితో పోలిస్తే తమ రెండవ త్రైమాసిక లాభం దాదాపు 19 రెట్లు పెరుగుతుందని శామ్‌సంగ్ ఇటీవల పేర్కొంది. కొత్త చిప్ తయారీ ప్లాంట్ల కోసం వందల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలను కూడా ఆ సంస్థ గత నెలలో ప్రకటించింది.

శాంసంగ్ మొబైల్ వ్యాపారం తన చరిత్రలోనే తొలిసారిగా నష్టాలను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం మొబైల్ విభాగం ఆపిల్ నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. టెలివిజన్లు, గృహోపకరణాల విభాగాలలో కూడా టీసీఎల్, హైసెన్స్ వంటి చైనా కంపెనీల నుండి బలమైన పోటీని శాంసంగ్ ఎదుర్కొంటోంది. ఏఐ బూమ్ వల్ల చిప్‌ల ధరలు పెరగడం కూడా టీవీలు, గృహోపకరణాల వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం లాభాలను దెబ్బతీశాయి. ఏడాది క్రితమే ఉద్యోగులు న్యూజెర్సీలోని కొత్త కార్యాలయంలోకి మారారు. ఇంతలోనే తన ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీ నుండి టెక్సాస్‌కు తరలిస్తూ శాంసంగ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

#Samsung Job Cuts#Samsung#Samsung Electronics#US#Consumer electronics business#New Jersey#Texas#Samsung Electronics America
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి