Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం కొలిక్కి వచ్చింది. ఆయన ఇచ్చిన వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందింది. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై విధించిన నిషేధాన్ని ఫిలిం ఫెడరేషన్ ఎత్తివేసింది. జానీ, ఆయన భార్య సుమలత వివరణతో సంతృప్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా చిరంజీవి, బాలకృష్ణల ఎంట్రీతో జానీ మాస్టర్ పై బ్యాన్ ఎత్తివేసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం జానీ మాస్టర్ సినిమాల్లో పని చేయవద్దని ఫిలిం ఫెడరేషన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్, డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతతో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ సుదీర్ఘంగా చర్చలు జరపారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయని.. జానీ మాస్టర్ వర్సెస్ డాన్సర్స్ యూనియన్ మధ్య జరిగిన విషయాలపై వారు వివరణ ఇచ్చారని అనిల్ వల్లభనేని తెలిపారు. జానీ మాస్టర్, సుమలత ఇచ్చిన వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందిందని తెలిపారు. జానీ మాస్టర్ పై ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. 26న డ్యాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీలో రాజీనామాలు చేసిన వాళ్ళందరూ కలసికట్టుగా ముందుకెళ్తారని అనిల్ వల్లభనేని చెప్పారు.
అంతకుముందు జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అటు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చిరంజీవి, బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఇరువర్గాలతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్చలు జరిపారు.
అసోసియేషన్‌లో మెంబర్షిప్, ఎన్నికల అంశంపై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. డ్యాన్సర్ అసోసియేషన్ విషయంలో జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు గొడవను పెద్దది చేశాయి. సభ్యులను రెచ్చగొట్టే విధంగా జానీ వ్యాఖ్యలు ఉన్నాయని ఫెడరేషన్ మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని జులై 14న పిలిచినా జానీ మాస్టర్ రాకపోవడంపై సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ఈ నెల 17న నోటీసులు జారీ చేసి జానీ మాస్టర్ పై ఆల్ ఇండియా స్థాయిలో సస్పెన్షన్ విధించింది. 7 రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. బహిరంగ క్షమాపణ చెప్పేవరకు ఫెడరేషన్ తరపున జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించింది.












