Health

Health: కాఫీ తాగేవాళ్లు జాగ్రత్త..! ఈ సమస్యలుంటే మీకు ప్రమాదమే..!

రచన: Venu5 నిమిషాల పఠనం

కాఫీ ఎంత మేలు చేస్తుందో, కొన్ని పరిస్థితుల్లో అంతే హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు..

చాలా మందికి ఉదయం ఒక కప్పు కాఫీతోనే ప్రారంభమవుతుంది. కాఫీ తాగితే ఉత్సాహం వస్తుంది, అలసట తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుందని భావిస్తారు. కానీ కాఫీ ఎంత మేలు చేస్తుందో, కొన్ని పరిస్థితుల్లో అంతే హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రిటన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మితంగా, అంటే పరిమితంగా కాఫీ తాగేవారిలో అకాల మరణ ప్రమాదం తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే దీన్ని అతిగా తీసుకుంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని హెచ్చరించారు. వినడానికి ఇది మంచి వార్తే అయినప్పటికీ... అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు.

ఇక ఆస్ట్రేలియాలో జరిగిన మరో అధ్యయనం ప్రకారం.. రోజుకు ఆరు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందట. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, డిమెన్షియా వంటి సమస్యల ముప్పు పెరగవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా.. నిద్రలేమి లేదా అధిక ఒత్తిడితో బాధపడేవారు. కాఫీలో ఉండే కెఫీన్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీంతో నిద్ర మరింత దూరమై, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పడుకునే ముందు కాఫీ తాగడం పూర్తిగా నివారించాలి.

రెండోది.. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు. భోజనం చేసిన వెంటనే కాఫీ తాగితే ఐరన్ శోషణ తగ్గుతుంది. దీంతో రక్తహీనత సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.

మూడోది.. గర్భిణీలు. గర్భధారణ సమయంలో అధిక కెఫీన్ తీసుకోవడం శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే వైద్యుల సూచన మేరకే కాఫీ తీసుకోవడం మంచిది.

నాలుగోది.. అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలున్నవారు. కెఫీన్ వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు తాత్కాలికంగా పెరగడం జరుగుతుంది. కాబట్టి వీరు కాఫీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

ఐదోది.. గ్యాస్ట్రిక్, అసిడిటీ లేదా గుండెల్లో మంట సమస్యలతో బాధపడేవారు. కాఫీ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో అసిడిటీ, రిఫ్లక్స్, గుండెల్లో మంట, ఛాతీ అసౌకర్యం వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

కాబట్టి కాఫీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా.. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకుని కాఫీని తీసుకోవడం మరింత సురక్షితం.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Coffee drinkers#beware#risk#issues
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి