Spirituality

Spirituality: శనీశ్వరుడి అనుగ్రహనికి ఏం చేయాలంటే!..

రచన: Venu5 నిమిషాల పఠనం

మనిషిని సన్మార్గంలో నడిపించే కర్మఫల ప్రదాత శనీశ్వరుడు.. తప్పు చేసినవారిని శిక్షిస్తాడని... ధర్మాన్ని ఆచరించినవారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని. అందుకే శనిదేవుడి కోపం ఎంత తీవ్రమో.. ఆయన అనుగ్రహం అంత గొప్పదని పెద్దలు చెబుతారు.

శనిదేవుడు... ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది కష్టాలు, పరీక్షలు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. కానీ పురాణాలు, వేదాలు, జ్యోతిష్య శాస్త్రం మాత్రం మరో గొప్ప సత్యాన్ని చెబుతున్నాయి. శనీశ్వరుడు శిక్షించే దేవుడు కాదు.. మనిషిని సన్మార్గంలో నడిపించే కర్మఫల ప్రదాత. తప్పు చేసినవారిని శిక్షిస్తాడని... ధర్మాన్ని ఆచరించినవారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని. అందుకే శనిదేవుడి కోపం ఎంత తీవ్రమో.. ఆయన అనుగ్రహం అంత గొప్పదని పెద్దలు చెబుతారు.

మరోవైపు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఇలా స్తుతిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి..

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

ఈ శ్లోకంలోని ప్రతి పదానికి గొప్ప అర్థం ఉంది. నీలాంజన సమాభాసం అంటే నీలి కాటుకలాంటి కాంతితో ప్రకాశించేవాడు. రవిపుత్రం అంటే సూర్యభగవానుడి కుమారుడు. యమాగ్రజం అంటే యమధర్మరాజుకు అన్న. ఛాయాదేవి, సూర్యదేవునికి జన్మించిన దైవం శనైశ్చరుడు. ఈ శ్లోకాన్ని భక్తితో జపిస్తే మనసుకు ధైర్యం, జీవితానికి స్థిరత్వం కలుగుతాయని పురాణాలు పేర్కొంటాయి.

ఇక పెద్దలు ఎప్పుడూ "శని" అని కాకుండా "శనీశ్వరుడు" అని పిలవాలని సూచిస్తారు. ఎందుకంటే "ఈశ్వర" అనే పదం దైవత్వానికి, ఐశ్వర్యానికి ప్రతీక. మహేశ్వరుడు, వేంకటేశ్వరుడు అనే పేర్లలో ఉన్నట్లే... శనీశ్వరుడు అనే నామంలో కూడా అదే పవిత్రత ఉందని విశ్వసిస్తారు. భక్తితో ఆ పేరును స్మరించినవారిపై ఆయన కరుణ చూపుతాడని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి.

పురాణాల్లో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైనది నిజాయితీ, వినయం, ధర్మాచరణ. కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు... ఇతరులకు అన్యాయం చేయకుండా జీవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను ఆదరించడం, పేదలకు సహాయం చేయడం... ఇవన్నీ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన సేవలుగా చెప్పబడింది.

అలాగే నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు సమర్పించడం, నువ్వులతో చేసిన నైవేద్యం లేదా చిమ్మిలి సమర్పించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. ముఖ్యంగా శనివారాల్లో శివాలయ దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ, హనుమంతుడి ఆరాధన, అయ్యప్పస్వామి పూజ చేయడం కూడా ఎంతో శుభప్రదమని చెబుతారు.

అలాగే శనిదేవుడు మన శత్రువు కాదు. మన కర్మలను మనకే చూపించే గురువు అని అందరూ గుర్తించాలి. మనలోని అహంకారాన్ని తొలగించి, సహనాన్ని పెంచి, జీవిత విలువను నేర్పించే దైవం. అందుకే శనీశ్వరుడికి భయపడకండి... భక్తితో ఆరాధించండి. ధర్మాన్ని పాటించండి. మంచి పనులు చేయండి. అప్పుడు శనీశ్వరుడి కటాక్షం మీ జీవితంలో కష్టాలను అవకాశాలుగా.. పరీక్షలను విజయాలుగా మార్చగలదని పురాణాలు, వేదాలు, జ్యోతిష్య శాస్త్రం విశ్వాసంతో చెబుతున్నాయి..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#India#grace#Lord Shani#Chhayadevi#Suryadeva
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి