ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో ఎదురైన ఓటమిని అర్జెంటీనా జట్టు ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. మ్యాచ్ అనంతరం జరిగిన అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అర్జెంటీనా మేనేజర్, కోచ్ లియోనెల్ స్కాలోని తీవ్ర భావోద్వేగానికి లోనై వెక్కివెక్కి ఏడ్చారు. తన భవిష్యత్తు, కోచింగ్ పదవి విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన కన్నీళ్లతో ప్రెస్ మీట్ నుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.
2022 ఖతార్ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలిపిన స్కాలోని, ఈసారి కూడా టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాలని భావించినా ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన ఎక్స్‌ట్రా టైమ్ గోల్ ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది డిసెంబర్‌తో కాంట్రాక్ట్ ముగియనున్న నేపథ్యంలో, తన భవిష్యత్తుపై స్కాలోని కీలక వ్యాఖ్యలు చేశారు. తానే ఇకపై ఈ పదవిలో కొనసాగగలనో లేదో తెలియడం లేదని, దీనిపై అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడతానని స్పష్టం చేశారు.
ఈ స్థానంలో ఉండే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ చివరి నిమిషం వరకు తమ సర్వస్వాన్ని ధారపోశారని కొనియాడారు. అయితే ప్రస్తుతానికి తన గురించి తాను ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలని కన్నీళ్లు తుడుచుకుంటూ పేర్కొన్నారు. అర్జెంటీనా జట్టును నడిపించడం ఎంతో అద్భుతమైన విషయమన్నారు. ఇంతటి బలమైన, అద్భుతమైన జట్టును మళ్లీ నిర్మించడం చాలా కష్టమైన పని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత విజయాలకంటే మరేదైనా సాధించగలమా అనేది తనకు తెలియడం లేదంటూ భావోద్వేగాలను అణచుకోలేక ప్రెస్ కాన్ఫరెన్స్‌ను మధ్యలోనే ముగించారు.
మరోవైపు, 39 ఏళ్ల కెప్టెన్ లియోనెల్ మెస్సీ భవిష్యత్తు గురించి తామింకా మాట్లాడుకోలేదని స్కాలోని వెల్లడించారు. ఈ టోర్నీలో మెస్సీ 8 గోల్స్ చేసినప్పటికీ, ఫైనల్లో స్పెయిన్ డిఫెండర్లు అతడిని పూర్తిగా కట్టడి చేశారని గుర్తుచేశారు. మెస్సీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడని, తను ఆడకూడదు అని నిర్ణయించుకునే వరకు జట్టులోనే ఉంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. మెస్సీ లాంటి గొప్ప ఆటగాడు తమ జట్టులో ఉన్నందుకు అర్జెంటీనాలో ప్రతి ఒక్కరూ గర్వపడాలని స్కాలోని కొనియాడారు.
https://x.com/dammiedammie35/status/2079013778104967479?s=20












