తెలంగాణ

తెలంగాణ బీజేపీ డోర్స్ ఓపెన్.. నెల రోజుల టార్గెట్ ఫిక్స్!

రచన: Kashi10 నిమిషాల పఠనం

బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభ‌య్ పాటిల్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. నెల రోజులాగండి.. మా గేమ్ ఏంటో చూపిస్తామన్న‌ట్టుగా మాట్లాడారు పాటిల్. నెల త‌ర్వాత ఏం జ‌ర‌నుగందనే అంశంపై అంతా చ‌ర్చించుకుంటున్నారు. బీజేపీ డోర్స్ ఓపెన్ చేసింద‌ని, ఎవ‌రైనా వ‌చ్చి పార్టీలో చేరొచ్చ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇది ఆరంభం మాత్ర‌మే అని చెప్పిన ఆయ‌న‌, రానున్న రోజుల్లో ఇంకా చాలా జ‌రుగుతాయ‌ని తేల్చేశారు.

బీజేపీ మిష‌న్ తెలంగాణ‌

వ‌చ్చే వారి కోసం డోర్స్ ఓపెన్

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ షురూ...

నెల రోజు త‌ర్వాత చూడండి: అభ‌య్ పాటిల్

తెలంగాణ బీజేపీలో కీల‌క పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్న‌టి దాకా ఉప్పు నిప్పుగా ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు హైక‌మాండ్ భారీ ఆప‌రేష‌నే చేప‌ట్టింది. కేంద్ర మంత్రి బండి సంజ‌య్, ఎంపీ ఈటెల రాజేంద‌ర్ మ‌ధ్య స‌యోధ్య కుదిరింది. దీంతో పార్టీలో కొత్త ఉత్సాహం మొద‌లైంది. అతి త్వ‌ర‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు రానుండ‌డంతో.. ఈ ప‌రిణామాల‌ను సానుకూలంగా భావిస్తున్నారు కార్య‌క‌ర్త‌లు. ఇక పార్టీకి మంచి రోజులు వ‌చ్చిన‌ట్టేన‌ని సంబ‌ర ప‌డుతున్నారు.

నెల త‌ర్వాత చూడండి: అభ‌య్ పాటిల్

ఇదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభ‌య్ పాటిల్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. నెల రోజులాగండి.. మా గేమ్ ఏంటో చూపిస్తామన్న‌ట్టుగా మాట్లాడారు పాటిల్. నెల త‌ర్వాత ఏం జ‌ర‌నుగందనే అంశంపై అంతా చ‌ర్చించుకుంటున్నారు. బీజేపీ డోర్స్ ఓపెన్ చేసింద‌ని, ఎవ‌రైనా వ‌చ్చి పార్టీలో చేరొచ్చ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇది ఆరంభం మాత్ర‌మే అని చెప్పిన ఆయ‌న‌, రానున్న రోజుల్లో ఇంకా చాలా జ‌రుగుతాయ‌ని తేల్చేశారు.

రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావుతో బ్రేక్ ఫాస్ట్ మీటింగులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో ప్ర‌త్యేక స‌మావేశాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు అభ‌య్ పాటిల్. ఈ దూకుడు చూస్తుంటే తెలంగాణ‌లో బీజేపీ మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆకర్ష్ మొద‌లుపెట్టిందా అనే చ‌ర్చ ప్రారంభ‌మైంది. వాస్త‌వానికి ఇప్ప‌టికీ చాలా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి స‌రైన అభ్య‌ర్థులే లేరు. ఈ విష‌యం రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు హైక‌మాండ్ దాకా ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో ఎలా పోరాడ‌గ‌ల‌రు. అందుకే ప్లాన్ B ని యాక్టివేట్ చేస్తున్నారు అభ‌య్ పాటిల్.

పార్టీలో నాయ‌కుల మ‌ధ్య ఉన్న విభేదాలు ప‌రిష్క‌రించ‌డం మొద‌టి టాస్క్. ఇత‌ర పార్టీల్లోని నాయ‌కుల‌ను బీజేపీలో చేర్చుకోవ‌డం రెండో టాస్క్. పార్టీలో విభేదాలు ఇలాగే కొన‌సాగితే.. బ‌య‌టివారు ఎవ‌రూ రార‌నే విష‌యం బీజేపీ పెద్ద‌ల‌కు అర్థ‌మైంది. అందుకే... హ‌డావుడిగా మిష‌న్ తెలంగాణ‌కు శ్రీకారం చుట్టారు. నాయ‌కుల మ‌ధ్య విభేదాల‌ను ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రిస్తూ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజ‌య్, ఈటెల రాజేంద‌ర్ మ‌ధ్య స‌యోధ్య కుదిర్చారు. ఎంపీ ధ‌ర్మపురి అర‌వింద్ ఇంటికెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపారు. మిగిలిన నాయ‌కుల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. జిల్లా అధ్య‌క్షుల ప‌నితీరుపైనా రిపోర్టును సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్ర పార్టీలో భారీ మార్పులు..?

బీజేపీ హైక‌మాండ్ స్పీడ్ చూస్తుంటే.. తెలంగాణ బీజేపీలో త్వ‌ర‌లోనే భారీ మార్పులు జ‌రుగుతాయా అనే చ‌ర్చ మొద‌లైంది. కేంద్ర మంత్రి వ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత రాష్ట్ర పార్టీలో కూడా మార్పులు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఈ మార్పులు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లే లక్ష్యంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. మాస్ లీడ‌ర్ల‌కు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించి స్పీడ్ పెంచే అవ‌కాశ‌ముంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ జోరును త‌ట్టుకొని నిల‌బ‌డాలంటే.. ఈ స్పీడ్ ఏ మాత్రం చాల‌ద‌ని అభ‌య్ పాటిల్ డిసైడ‌య్యార‌ట‌. ఇదే విష‌యాన్ని జాతీయ నాయ‌కులకు చెప్పార‌ట‌. వారు కూడా దీనికి ఓకే చెప్ప‌డంతో.. పార్టీ చికిత్స‌కు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు పాటిల్.

గ్రేట‌ర్ ఎన్నిక‌లే ఫ‌స్ట్ టార్గెట్

తెలంగాణ బీజేపీ ఫ‌స్ట్ టార్గెట్ గ్రేట‌ర్ ఎన్నిక‌లే. 2-3 నెల‌ల్లోనే గ్రేట‌ర్ ఎన్నిక‌లు ఉండొచ్చ‌ని సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ దూకుడుగా లేక‌పోతే దెబ్బ తిన‌డం ఖాయ‌మ‌ని అభ‌య్ పాటిల్ భావించారు. అందుకే మిష‌న్ మోడ్‌లో పార్టీకి చికిత్స మొద‌లుపెట్టారు. ఎట్టి ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్, మ‌ల్కాజ్‌గిరి, సైబ‌రాబాద్ కార్పొరేష‌న్ల‌లో స‌త్తా చాటాల్సిందేన‌ని రాష్ట్ర నాయ‌కుల‌కు తేల్చిచెప్పార‌ట అభ‌య్ పాటిల్.

బీజేపీకి ముందు నుంచి ప‌ట్టున్న ప్రాంతం హైద‌రాబాదే. కానీ మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. అప్ప‌ట్లోనే దీనిపై పార్టీలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. అందుకే పార్టీ విజ‌యాల ప‌రంప‌ర ఇక్క‌డి నుంచే మొద‌లు కావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది హైక‌మాండ్. ఈ నేప‌థ్యంలోనే ఇంత హ‌డావుడిగా పార్టీపై ఫోక‌స్ చేశారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ప్లానేంటి..?

షెడ్యూల్ ప్ర‌కార‌మైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2028 చివ‌ర్లో జ‌ర‌గాలి. ఒక‌వేళ జ‌మిలికి వెళితే 2029లో జ‌రుగుతాయి. ఎలా చూసినా మూడేళ్ల లోపే స‌మ‌య‌ముంది. అందుకే ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో కూడా ఫోక‌స్ చేయాల‌ని పార్టీ గ‌ట్టిగా డిసైడ్ అయింది. చాలా చోట్ల అభ్య‌ర్థులు కూడా లేక‌పోవ‌డం ఆ పార్టీకి ఇబ్బందిక‌రంగా మారింది. ఎలాగైనా ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను చేర్చుకోవాల‌నేది బీజేపీ టార్గెట్‌గా క‌నిపిస్తోంది. అందుకే అభ‌య్ పాటిల్ నోటి నుంచి నెల రోజుల మాట వినిపిస్తోంది. నెల రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడండ‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న స‌హ‌జంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. బీజేపీ నాయ‌కుల‌తో ఎవ‌రు ట‌చ్‌లో ఉన్నారా అని ఆ పార్టీల పెద్ద‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

మొత్తానికి నిన్న మొన్న‌టి దాకా స్త‌బ్ధుగా ఉన్న తెలంగాణ బీజేపీ.. ఒక్క‌సారిగా మిష‌న్ మోడ్‌లోకి మారింది. ఎన్నిక‌లే టార్గెట్‌గా స‌రికొత్త ప్లాన్స్‌తో ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది.

#BJP Telangana#Abhay Patil#Telangana Politics#Operation Akarsh#Bandi Sanjay#Eatala Rajender
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి