హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ దోపిడీ కలకలం సృష్టించింది. ఒక ప్రముఖ ఎక్స్‌పోర్ట్ కార్యాలయంలోకి చొరబడిన దుండగులు లాకర్‌లో భద్రపరిచిన సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గురు కృప ఎక్స్‌పోర్ట్ కార్యాలయంలోని వాష్ రూమ్ కిటికీని దుండగులు చాకచక్యంగా ధ్వంసం చేశారు. ఆ కిటికీ గుండా లోపలికి ప్రవేశించిన దుండగులు ఆఫీసులోని లాకర్‌ను పగలగొట్టి అందులో దాచిన కిలో బంగారు నగలను దొంగిలించుకుపోయారు. లాకర్‌లో 1028గ్రాముల బంగారం ఉన్నట్లు బాధితుడు తెలిపాడు.
కార్యాలయంలో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన సూరత్‌కు చెందిన సదరు వ్యాపారి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఆఫీసు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.












