అనుమతులు లేకుండా నడుస్తున్న ఇటుకబట్టీలు.. మరోవైపు ఆగని కాలుష్యం.. జిల్లాల్లో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది. అధికారిక అంచనాల ప్రకారం జిల్లాలో 400కు పైగా ఇటుకబట్టీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలుస్తుంది. అయితే వీటిలో ఎక్కువ సంఖ్యలో బట్టీలు నిబంధనలు పాటించకుండా, అవసరమైన అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది.
ఇటుకల తయారీకి అవసరమైన రేగడి, ఎర్రమట్టి, నల్లమట్టిని గనులు, భూగర్భ వనరుల శాఖ అనుమతి తీసుకుని, సీనరేజీ రుసుము చెల్లించి మాత్రమే తవ్వాలి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రాత్రి వేళల్లో జేసీబీలతో వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వి గుట్టలుగా నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో సుమారు వందకు పైగా ఇటుకబట్టీలు అనుమతులు లేకుండా మట్టి తవ్వినట్లు బయటపడగా, ఒక్కో యజమాని నుంచి రూ.10 వేల చొప్పున సీనరేజీ రుసుము వసూలు చేశారు. అయితే జరిమానాలు విధిస్తే మాత్రం సరిపోదు.. ఇలాంటి చర్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేదా నిబంధనలు కఠినంగా చేయాలని అంటున్నారు.
ఇక ఇటుకబట్టీ ఏర్పాటు చేయాలంటే ముందుగా గ్రామ పంచాయతీ తీర్మానం, గనుల శాఖ అనుమతి, కలప వినియోగానికి అటవీ శాఖ అనుమతి, కాలుష్య నియంత్రణ మండలి నుంచి క్లియరెన్స్ తప్పనిసరి. కానీ అనేక బట్టీలు ఈ నిబంధనలను పక్కనపెట్టి, స్థానిక సంస్థలకు నామమాత్రపు రుసుములు చెల్లిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫలితంగా వెలువడే కాలుష్యం పర్యావరణానికి అసలు సమస్యగా మారింది . దేశీయ పద్ధతుల్లో ఇటుకలు కాల్చడం, ప్రమాణాలకు అనుగుణమైన చిమ్నీలు లేదా పొగగొట్టాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దట్టమైన నల్లటి పొగ గ్రామాలపై కమ్మేస్తోంది. ఈ పొగ వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులు కూడా పొగ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కేవలం అనుమతులు ఇవ్వడం మాత్రమే కాకుండా.. సంబంధిత శాఖలు తరచూ తనిఖీలు నిర్వహించడం, కాలుష్య నియంత్రణ ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయించడం, అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలు నడవాలి తప్ప.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే పరిస్థితి రావద్దని స్థానికులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో అధికారుల స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి..












