రోజంతా ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా.. రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత తొలి రెండు నుంచి మూడు గంటలు జీర్ణక్రియకు అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో మనం పాటించే అలవాట్లు.. అజీర్ణం, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో లేదా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి రాత్రి భోజనం తర్వాత తప్పకుండా దూరంగా ఉంచాల్సిన ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది భోజనం పూర్తి చేసిన వెంటనే మంచంపై వాలిపోతారు. కానీ ఇలా చేయడం వల్ల కడుపులో ఉండే ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వెళ్లే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గుండెల్లో మంట, గొంతులో మంట, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు.. అందుకే నిద్రపోయే సమయానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం పూర్తి చేయడం మంచిదంటున్నారు.
తిన్న వెంటనే జిమ్‌కు వెళ్లడం, పరుగెత్తడం లేదా ఎక్కువ శ్రమ చేసే వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. కడుపు నొప్పి, వికారం, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు. తీవ్రమైన వ్యాయామం చేయాలనుకుంటే కనీసం గంటన్నర నుంచి రెండు గంటల గ్యాప్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేసిన వెంటనే లీటర్ల కొద్దీ నీరు తాగడం కొంతమందిలో కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం వంటి సమస్యలకు కారణమవుతుంది. దాహంగా ఉంటే కొన్ని నీళ్ళు తాగడం ఉత్తమమని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగడం లేదా మద్యం సేవించడం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇవి యాసిడ్ సమస్యలను పెంచడమే కాకుండా కడుపు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
మరోవైపు ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు.. క్రమంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే తక్కువ మోతాదులో, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి. తిన్న వెంటనే గంటల తరబడి మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం కూడా తగ్గించాలి. పండ్లు తినాలనుకుంటే భోజనం చేసిన వెంటనే కాకుండా.. ఒకటి లేదా రెండు గంటల తర్వాత తీసుకోవడం మంచిది. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేసే అలవాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాత్రి సమయంలో ఎక్కువ నూనెతో చేసిన వంటకాలు, వేయించిన పదార్థాలు, అధిక చక్కెర ఉన్న స్వీట్లు తగ్గించడం మంచిది. అలాగే భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగకుండా కనీసం గంట తర్వాత తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే గుండెల్లో మంట, తరచూ అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం లేదా ఆహారం మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలు పదేపదే కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అవసరం.
గుర్తుంచుకోండి... మంచి ఆరోగ్యం కేవలం మంచి ఆహారంతోనే కాదు.. భోజనం తర్వాత పాటించే సరైన అలవాట్లతో కూడా వస్తుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












