నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశంలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు డిగ్రీని అర్హతగా ప్రకటించింది. ఉద్యోగాల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి ఇదొక సదవకాశం అని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైల్వేలో జాబ్స్ కాబట్టి కాస్త కాంపిటీషన్ టఫ్‌గానే ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను సైతం రైల్వే ప్రకటించింది.
భారతీయ రైల్వేలో వివిధ రైల్వే జోన్లలో మొత్తంగా 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వాటి భర్తీ కోసం అధికారికంగా రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు కలిగిన ఏదేని వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలని కండీషన్ ఉంది. సెక్షన్ కంట్రోలర్ అనేది రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే కీలకమైన విభాగం కావడంతో అభ్యర్థుల కంటి చూపునకు సంబంధించి రైల్వే శాఖ కఠిన నిబంధనలు విధించింది.
దరఖాస్తుదారులు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని తెలిపింది. అభ్యర్థులను మొత్తం నాలుగు దశల్లో ఈ జాబ్స్ కోసం ఎంపిక చేయనున్నారు. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష , ఆ తర్వాత కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్షలను నిర్వహిస్తారు.అందులో పాస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆపై మెడికల్ టెస్టులు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఈ మేరకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 14ను దరఖాస్తునకు చివరి తేదీని నిర్ణయించారు. రైల్వే శాఖ అధికారిక పోర్టల్ https://www.rrbapply.gov.in/#/auth/landing లింక్ ద్వారా నేరుగా లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చని రైల్వే రిక్రూట్‌మెంట్ అధికారులు తెలిపారు.












