ప్రయివేటు స్కూల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను ఫీజుల పేరిట ఇబ్బందులకు గురిచేస్తూ తల్లిదండ్రులను నానా అవస్థలకు గురిచేస్తున్నట్టు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో సర్కార్.. ఫీజుల నియంత్రణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రైవేటు స్కూళ్లు వసూలు చేసే ట్యూషన్ ఫీజుల వివరాలను కచ్చితంగా పాఠశాల నోటీసు బోర్డులతో పాటు తమ అధికారిక వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.
స్కూళ్ల ఫీజు వివరాలు వెల్లడించడంతో పాటు ప్రయివేటు పాఠశాలలు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి 2023-24, 2024-25 అకడమిక్ ఇయర్ లావాదేవీలను ‘సీఏ’ ధృవీకరించిన ఆడిట్ రిపోర్టులను జులై 30లోగా విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా ఆడిట్ నివేదికలను సమర్పించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఈ విషయం కాస్త రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది.
అయితే, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేలకుపైగా ఉన్న ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాల ఆధారంగా ఫీజులను నియంత్రించేందుకు, అదనపు వసూళ్లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని భావిస్తున్నది. అందుకోసం ఓ ప్రత్యేక కమిటీ వేయాలని యోచిస్తున్నది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయివేటు దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని పేరెంట్స్ చెబుతున్నారు.












