రాష్ట్రంలో మరోసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఓవైపు పంటలు ఆలస్యం కావడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుకుండా ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పంపించినట్టు సమాచారం.
వచ్చే నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని.. వచ్చే నెలలో సరఫరా చేయనున్నట్టు సమాచారం. సాధారణంగా ప్రతి నెలా మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. కానీ, వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనుండటంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరచే ఉంటుందని తెలుస్తోంది. ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది.
ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్దుకాణాలకు రెండు, మూడుసార్లు సరిపడా బియ్యం సరఫరా కానుంది. చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండు సార్లు రవాణా జరుగనుంది. గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒకే సారి రేషన్ బియ్యం సప్లయ్ చేసిన విషయం తెలిసింది.రాష్ట్రంలో 1.05 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల లబ్దిదారులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం పంపిణీ చేయనుండగా..ఈ కేవైసీ చేసిన వారికి మాత్రమే బియ్యం ఇస్తారని పౌరసరఫరాల శాఖ పేర్కొన్నట్టు తెలిసింది.












