పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు పార్లమెంట్ వెలుపల నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది సీజేపీ నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు.మరోవైపు ఇలా సభ ప్రారంభం అయ్యిందో లేదో విపక్ష ఎంపీలు నీట్ పేపర్ లీకేజీ, అయోధ్యలో విరాళాల చోరీ అంశంపై చర్చ పెట్టాలని, స్పీకర్ ఓం బిర్లా సమయం ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు.
దీంతో లోక్‌సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభ్యులు సభా మర్యాద పాటించాలని సూచించారు. సభ్యులు మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని చెప్పినా ప్రతిపక్ష ఎంపీలు అసలు వినిపించుకోవడం లేదు. చర్చలు, ప్రశ్నలు లేవనెత్తడానికే పార్లమెంట్ ఉందని స్పీకర్ క్లారిటీ ఇచ్చారు.
సహృద్భావ వాతావరణంలో చర్చలు జరపాలని స్పీకర్ విపక్ష ఎంపీలకు సూచించారు. అయినప్పటికీ వారు వినిపించుకోవడం లేదని తెలిసింది. అయోధ్య అంశం, నీట్ పై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. సభ్యుల నిరసన మధ్యే ప్రశ్నోత్తరాలు చేపట్టగా స్పీకర్ ఓం బిర్లా పోడియం వైపు విపక్ష సభ్యులు వచ్చి నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్య లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. సభ ప్రారంభంకాగానే ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీ నాదెండ్ల భాస్కరరావుకు పార్లమెంట్ సభ్యులు సంతాపం తెలిపారు.












