తెలంగాణ

Bhatti Vikramarka: సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం.. భట్టి విక్రమార్క!..

రచన: Venu•••6 నిమిషాల పఠనం

మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తెలంగాణ వైఖరిని భట్టి విక్రమార్క స్పష్టంగా వెల్లడించారు. మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను ఉదాహరణగా పేర్కొంటు.. భారత సమాఖ్య వ్యవస్థ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు.

కేంద్ర–రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతో పాటు, తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భిన్నమైన ప్రయోజనాలు ఎదురైనప్పటికీ.. న్యాయబద్ధమైన పరిష్కారం కనుగొనగలగడమే సమాఖ్య వ్యవస్థకు అసలైన పరీక్ష అని స్పష్టం చేశారు.

మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తెలంగాణ వైఖరిని భట్టి విక్రమార్క స్పష్టంగా వెల్లడించారు. మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను ఉదాహరణగా పేర్కొంటు.. భారత సమాఖ్య వ్యవస్థ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కోసం రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని.. అయితే నదులు, విద్యుత్ గ్రిడ్లు, కార్మికులు, వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు అడ్డంకులు కావని చెప్పారు.

సమస్యలు రాష్ట్ర సరిహద్దులను ప్రభుత్వ ఫైళ్ల కంటే వేగంగా దాటుతున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే దక్షిణ ప్రాంతీయ మండలి వంటి వేదికల ప్రాధాన్యత మరింత పెరుగుతోందన్నారు. ఇక కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు ఇప్పటికే ఏర్పాటైన చట్టపరమైన వ్యవస్థల ప్రకారం న్యాయమైన వాటా దక్కాలని భట్టి స్పష్టం చేశారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను అడ్డుకోవాలని, కృష్ణా పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే సూత్రాలను వర్తింపజేయాలని కోరారు.

మరోవైపు తెలంగాణ ఆంధ్ర మధ్య కృష్ణా జలాల కేటాయింపు అంశం ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–II పరిధిలో ఉన్నందున.. చట్టపరమైన ప్రక్రియ ద్వారా త్వరగా పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. మిగులు జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను పరిరక్షించడంతో పాటు.. పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని భట్టి విక్రమార్క కోరారు.

అలాగే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించే చర్యలు కూడా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమల్లోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వీటికి తుది పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగేపెండింగ్ అంశాలపై తుది నిర్ణయాలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలని తెలంగాణ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు షెడ్యూల్–IXలోని ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనకు సంబంధించి 23 సంస్థలపై తెలంగాణ తన అభిప్రాయాలను ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిందని తెలిపిన భట్టి.. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన అంశంలోనూ.. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

నీటి భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, పట్టణీకరణ, రవాణా–లాజిస్టిక్స్, ఆర్థిక పోటీతత్వం వంటి అంశాలు రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కీలక సవాళ్లుగా మారనున్నాయని.. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పోటీ పడుతూనే పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం కలిసి అభివృద్ధి చెందితే.. భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

అదేవిధంగా తదుపరి 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆకాంక్షించారు. సమస్యలు ట్రిబ్యునళ్లకు, కమిటీలకు, అంతులేని ఉత్తర ప్రత్యుత్తరాలకు వెళ్లకుండా.. వేగంగా పరిష్కారం కావాలని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.

#tamilanadu#Mahabalipuram#31st Southern Zonal#Council Meeting#Telangana#Bhatti Vikramarka
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి