తెలంగాణ

22A Lands: 22ఏ సమస్యపై ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం- ప్రజలకు మంత్రి పొంగులేటి భరోసా, అధికారులకు కీలక ఆదేశాలు

రచన: NK•••6 నిమిషాల పఠనం

22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫిర్యాదుగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

22A Lands: 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫిర్యాదుగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

అధికారులతో కీలక సమీక్ష

22ఏ ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వస్తున్న కాల్స్, వాటి పరిష్కారం, ఏయే సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి, వచ్చిన కాల్స్‌కు ఎలాంటి సమాచారం అందిస్తున్నారు తదితర అంశాలపై బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు మంత్రి పొంగులేటి. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతి ఫిర్యాదును పరిశీలించాలి

కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి వదిలేయకుండా, దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌ రిజిస్ట్రార్ తదితర అధికారులకు పంపించాలని మంత్రి ఆదేశించారు. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు

కాల్ సెంటర్ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. వచ్చిన ఫిర్యాదుపై నిజానిజాలను నిర్ధారించి, దరఖాస్తుదారు పేర్కొన్న సమస్య వాస్తవమా? భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు వచ్చింది? దరఖాస్తుదారుడికి అర్హత ఉందా? అనే అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పరిశీలన అనంతరం స్పష్టమైన కారణాలతో నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజలు తమ సమస్యను చెప్పిన తర్వాత పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి.

దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు, గడచిన రెండు మూడు రోజుల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపై కొత్తగా వచ్చే దరఖాస్తులు పెండింగ్‌లో పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం కలిగించాలి

22ఏ సమస్య పరిష్కారాన్ని ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలని.. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. “రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తి తన సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకంతో బయటకు వెళ్లాలి. వచ్చిన దరఖాస్తును మరో కార్యాలయానికి పంపించి చేతులు దులుపుకోకండి. చివరి వరకు పర్యవేక్షించండి. మీ పనితీరుతో ప్రజల అభిమానాన్ని చూరగొనండి” అని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి. అధికారులు సొంత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని, ప్రభుత్వ ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా పని చేయాలని తేల్చి చెప్పారు.

#22A Lands#Telangana#Prohibited Lands#Ponguleti Srinivas Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి