Telangana High Court: రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు కోర్టు నిరాకరించింది. ఈ పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది.
పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా అందడం లేదని కోర్టు చెప్పింది. పెన్షన్లు, బెనిఫిట్స్ అందక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, కోర్టును ఆశ్రయిస్తున్నారని వెల్లడించింది. 2014 నుంచి అమలవుతున్న ఇలాంటి పథకాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందని కోర్టు పేర్కొంది.
ప్రజల పన్నులతో వచ్చే డబ్బును ఉచిత పథకాలకు వినియోగించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. భూ బాధితులకు పరిహారం చెల్లించడం లేదని తెలియజేసింది. ఇక, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో వివరాలు సరిగా లేవని హైకోర్టు చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


