దక్షిణాది రాష్ట్రాల మధ్య కీలక అంశాల పరిష్కారానికి వేదికగా నిలిచే 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని కోవలంలో ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక భేటీకి ఆతిథ్యం ఇస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు తెలంగాణ తరఫున సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ ప్రతినిధులు ఈ సమావేశం దృష్టికి రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి అంశాలు, పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర అంశాలను తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న నదీ జలాల పంపకం ఈ సమావేశంలో అత్యంత కీలక అంశంగా మారే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి సహా అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలపై రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు కూడా ప్రస్తుతం చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జల వివాదం కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకోనుంది. నీటి అంశాలతో పాటు రాష్ట్రాల మధ్య రవాణా, మౌలిక వసతులు, పారిశ్రామిక పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, ఐటీ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
అదే సమయంలో విపత్తుల నిర్వహణ, సైబర్ నేరాలు, నేరాల నియంత్రణ, పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయం, మహిళలు మరియు చిన్నారులపై నేరాల కేసుల వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి అంశాలు కూడా ఈ కౌన్సిల్ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు పరిస్థితిని సమీక్షించడంతో పాటు, రాష్ట్రాలు-కేంద్రం కలిసి పరిష్కరించాల్సిన కొత్త సమస్యలను గుర్తించడం కూడా ఈ సమావేశం ప్రధాన లక్ష్యం.
మొత్తంగా, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ.. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడమే ఈ 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలలోని కీలక రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది..


