సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా బయటపెడతానని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల పక్క పార్టీ వాళ్లు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని, మేము 10, 15 ఏళ్ల నుంచి దొబ్బించుకుంటున్నా.. తమకే ఎమ్మెల్యే టికెట్ రాలేదని, నిన్న గాక మొన్న వచ్చి టికెట్ కావాలంటే ఎలా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ అవినీతి మీద బాంబులు పేలుస్తానని కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘దమ్ముంటే రేవంత్ రెడ్డి అవినీతి బయటపెట్టు.నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు.. నువ్వు చేసే వ్యాఖ్యలకు మీ అమ్మ తల దించుకుంటుంది. బీజేపీ,బీఆర్ఎస్ కలిసి నీతో ఇలా మాట్లాడిస్తున్నారని అర్థం అవుతోంది’ అని ఇందిరా శోభన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉండగా, వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న సుస్మిత.. రెండ్రోజుల కిందట పరకాల సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పరకాల సెగ్మెంట్ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి నిలబడతారని, ఆయనను గెలిపించాలని సభకు వచ్చిన ప్రజలతో పాటు నియోజకవర్గ ఓటర్లను కోరారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రి కొండా తనయ సుస్మిత ఘాటుగా స్పందించారు.
‘రేవంత్.. నీకు కళ్లు నెత్తికెక్కినయా? అంటూ రెచ్చిపోయారు. సీఎం కాగానే నీకు కళ్లు నెత్తికెక్కినయా? నాకు కౌంటర్ ఇస్తే నీ భాగోతాలన్నీ బయటపెడతా. ఒకవైపు జెన్ జీకి టిక్కెట్లు అంటావ్.. మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరికి టికెట్ ఇస్తా అంటావ్.
నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. పరకాల ఎమ్మెల్యేను నేనే.నీ తమ్ముడు షెల్ కంపెనీకి అప్పనంగా రూ. 200 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేశావ్. నువ్వు, నీ తమ్ముళ్లు దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు.. నన్ను గెలికితే మీ స్కాంలు బయటపెడతా. నిన్ను కొడంగల్‌లో ప్రజలు ఒకసారి ఓడగొట్టారు.. అలాంటిది పదేళ్లు సీఎంగా ఉంటా అని ఎలా అంటావు? వేం నరేందర్ రెడ్డిని సలహాదారుడిగా పెట్టుకున్నావు కదా.. 3 ఏళ్లలో ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి? నీతో ఉన్న పొంగు ఎక్కువ సేపు పొంగదు.. నువ్వు ముఖ్యమంత్రో.. ఆయన ముఖ్యమంత్రో అర్థం కావట్లేదు. తెలంగాణలో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ నడుస్తుంది.. అసలు కాంగ్రెస్ వాళ్లు ఆనందంగా లేరు.
రేవంత్ పీసీసీ అవ్వాలని మా అమ్మే కోరుకుంది.. పీసీసీ అవ్వడానికి సహాయపడింది.. నిజమా? కాదా? పీసీసీ అయ్యాక మా ఇంటికొచ్చి 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానని మా నాన్నకు చెప్పలేదా? హైదరాబాద్ ఇందిరమ్మ ఇల్లు యాడ్‌లో ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ఫోటో వేయలేదు.. బీసీలు అంటే మీకు చులకనా?’ అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ తాజాగా తీవ్రస్థాయిలో మండిపడుతూ కౌంటర్ ఇచ్చారు.
https://x.com/TeluguScribe/status/2090321609483755846?s=20


