తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. లక్షల కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చి.. రైతులను, రియల్టర్లను, ఆస్తి యజమానులను భయపెట్టి బేరసారాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
దాదాపు కోటి ఎకరాలు 22ఏ జాబితాలో ఉన్నాయని ఆయన ఆరోపిస్తూ.. ఈ వ్యవహారం వెనుక అసలు కుట్రదారులు ఎవరో తేల్చేందుకు వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని భూముల విషయంలో గతంలోనూ 22ఏ పేరుతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2025లో గోపన్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్న వార్తలు ఆందోళన కలిగించాయి.
మరోవైపు, వివాదాస్పద భూములను 22ఏలో చేర్చడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.. 2026లోనూ ఈ వివాదం కొనసాగింది. జూన్‌లో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కుటుంబానికి చెందిన భూములు 22ఏ జాబితాలో చేరడంపై కోర్టును ఆశ్రయించారు. కొన్ని కేసుల్లో హైకోర్టు నిషేధిత జాబితలపై మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇదే సమయంలో ఆగస్టులో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితాలో చేర్చిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, మొత్తం కాలనీలు, పెద్ద సంఖ్యలో ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లడంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తానని పేర్కొంది.
ఇదే సమయంలో 22ఏ పేరుతో భారీ భూ కుంభకోణం జరుగుతోందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపిస్తూ.. ఇందులో ఎవరి పాత్ర ఉందో బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమన్నారు. అధికారుల తప్పిదమని మంత్రి పొంగులేటి చెబుతుంటే.. దీని వెనుక కుట్ర ఉందని మరో మంత్రి కోమటిరెడ్డి సంజాయిషీ ఇచ్చుకోవడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు.
అంతేకాదు.. గతంలో ఫీనిక్స్ సంస్థపై ఆరోపణలను చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఫీనిక్స్ ఆస్తుల బదలాయింపుపైనా తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. అలాగే 22ఏ అంశం పై మంత్రి పొంగులేటికి బహిరంగ చర్చకు రావాలని ఏలేటి సవాల్ విసిరారు. మరోవైపు నిషేధిత జాబితాలో తప్పులు జరిగితే వాటిని సరిచేస్తామని మంత్రి పొంగులేటి ఇప్పటికే ప్రకటించారు.
అర్హులైన భూ యజమానులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించేందుకు 45 రోజుల గడువును కూడా ప్రభుత్వం నిర్దేశించింది. ఆగస్టు 14లోగా భూ సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు, మెమోలు, ల్యాండ్ అక్విజిషన్ రికార్డులు, లేఅవుట్ అనుమతులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది.
ఇక ఒకవైపు ఇది కేవలం రికార్డుల్లో జరిగిన తప్పిదమని ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇందులో భారీ అక్రమాలు, అవినీతి కుట్ర ఉందని ఆరోపిస్తున్న క్రమంలో ప్రజలు పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. 22ఏ జాబితాలోకి నిజంగా ఎన్ని భూములు వెళ్లాయి? అందులో ఎన్ని ప్రభుత్వ భూములు? ఎన్ని ప్రైవేట్ భూములు? ఎవరెవరి ఆదేశాలతో ఈ భూములు చేరాయి?..
ఎక్కడ తప్పులు జరిగాయి? ఆ తప్పుల వెనుక నిర్లక్ష్యమా?.. లేక అక్రమ లావాదేవీలకు అవకాశం కల్పించే కుట్రా?.. మొదలగు ఈ అంశాలపై క్లారిటీ రావాలంటే.. పూర్తి జాబితా బహిర్గతం కావాలని, ప్రతి భూమి చరిత్రను పరిశీలించాలని, ఇందుకు బాధ్యులైన అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..


