రాష్ట్రంలో మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు నక్సలిజం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా, ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ సరికొత్త సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
ఎంపిక చేసిన సిబ్బందికి రెండు నెలల పాటు ప్రత్యేక అటాచ్‌మెంట్ శిక్షణ ఇచ్చి, వారి విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగా మొత్తం 8 కీలక విభాగాలకు పోస్టింగ్‌లు కేటాయించారు. పెరుగుతున్న ఆర్థిక నేరాలు, డిజిటల్ మోసాలను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించేలా బలగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
గతేడాది రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 8 వేల మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఈ సమస్యపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందువల్లనే పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్యధికంగా 224 మందిని నేరుగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. అలాగే ఆహార కల్తీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి 80 మందిని, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 79 మందిని కేటాయించారు.
గతేడాది సైబర్ నేరాల వల్ల ఏకంగా రూ.1,750 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్, యువతను పెడదారిన పట్టిస్తున్న మాదకద్రవ్యాల సరఫరా గొలుసును పూర్తిగా తెంచేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతూనే, విధుల్లో పూర్తి నిజాయతీ, అంకితభావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.


