దేశవ్యాప్తంగా ఈ 20 పెట్రోల్ మంట పుట్టిస్తున్న సంగతి తెలిసిందే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 20 పెట్రోల్ వల్ల ఇప్పటికే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక పేద మధ్యతరగతి వాళ్ళ బాధలు అయితే వర్ణాతీతం.. ఈ పెట్రోల్ తో ప్రస్తుతం వారి వద్ద ఉన్న వాహనాల వల్ల జేబులకు చిల్లు పడుతుండగా.. కొత్త వాహనాలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ 20 పెట్రోల్ వల్ల పొల్యూషన్ తగ్గుతుందని, అలాగే విదేశీ ఆయిల్ మీద ఆధారపడవలసిన అవసరం లేదని, రైతులకు కూడా గిట్టుబాటు అవుతుందని.. ఇలా ఎన్నో మాటలు చెబుతున్న ప్రభుత్వం కళ్ళకు ఇదే E20 వల్ల కలుగుతున్న నష్టాలు కనబడటం లేదా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ పెట్రోల్ మీద విదేశీ పన్నులు లేనప్పుడు ధరలు ఎందుకు అందుబాటులో లేకుండా పేరుగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొత్తానికి కేంద్రం తీరు కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనే సామెతను గుర్తుకు తెస్తుందని అంటున్నారు. అయితే తాజాగా ఈ E20 పెట్రోల్ వల్ల మరో జనం నెత్తిన మరో పిడుగు పడింది. ఇథనాల్ తరలింపు ప్రభావం చక్కెర ధరలపై పడింది. దీంతో దేశంలో చక్కెర ధరలు రికార్డు స్ధాయికి పెరిగిపోయాయి. వాహనాలకు వినియోగించే పెట్రోల్ లో ఇథనాల్ కలపాలన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో భారీ ఎత్తున చెరుకు నుంచి ఇథనాల్ తీసే కార్యక్రమం ప్రారంభమైంది.
ఇందుకోసం ప్రత్యేకంగా డిస్టిలరీను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించడం వల్ల పంచదార తీయడానికి చెరుకు తగ్గిపోతోంది. ఇదే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలే ఇప్పుడు పండుగల సీజన్ వస్తోంది. దేశంలో చక్కెర తగినంత అందుబాటులో లేకపోతే జనం గగ్గోలు పెట్టడం ఖాయం. దీంతో కేంద్రం ఇరుకునపడే అవకాశాలున్నాయని అంటున్నారు..
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోనే అతిపెద్ద చక్కెర మార్కెట్లలో ఒకటైన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హోల్‌సేల్ చక్కెర ధరలు భారీగా పెరిగాయి. ఆగస్టు ప్రారంభం నుంచి దాదాపు 20 శాతం పెరిగిన ధర.. 100 కిలోలకు రికార్డు స్థాయిలో రూ.5,350కి చేరింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. ఆగస్టు 18, 2026 నాటికి దేశవ్యాప్తంగా చక్కెర సగటు రిటైల్ ధర కిలోకు రూ.52.30గా నమోదైంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. పంజాబ్‌లో చక్కెర ధర కిలోకు సుమారు రూ.65కు చేరగా.. ముంబై, భోపాల్‌తో పాటు మరికొన్ని మార్కెట్లలో కిలో రూ.58 నుంచి రూ.63 మధ్య పలుకుతోంది. చక్కెర ధరల పెరుగుదలకు పరిమిత నిల్వలు, పండుగల సీజన్‌లో పెరగనున్న డిమాండ్‌తో పాటు చెరకు వినియోగంలో వచ్చిన మార్పులు కూడా కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును వినియోగించడం వల్ల దేశీయ చక్కెర లభ్యతపై ప్రభావం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం కొనసాగిస్తూనే.. ఆహార ధరలపై ప్రభావం పడకుండా చక్కెర లభ్యత, ధరల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.. మరి కేంద్రం నిర్ణయం ఏమిటో!?..


