Konda Surekha: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు మంత్రి కొండా సురేఖ సమాధానం ఇచ్చారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖ రాశారు. అందులో ఆమె ఘాటుగా స్పందించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు అని తేల్చి చెప్పారు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయటం సమంజసం కాదన్నారు.
నా ప్రమేయం లేదని గుర్తించాలి
నాకు నోటీసులు ఇవ్వడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు. తనకు సంబంధం లేని అంశంలో తన వివరణ కోరడం ఎంతమాత్రమూ సముచితం కాదన్నారామె. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ నియమావళిపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుస్మితా పటేల్ వ్యాఖ్యల వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని, తనకు ఇచ్చిన క్రమశిక్షణా నోటీసులను ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ కోరారు.
సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు
కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో దుమారం రేపాయి. కళ్లు నెత్తికెక్కాయా? అంటూ సీఎం రేవంత్ ను ఉద్దేశించి సుస్మిత చేసిన కామెంట్స్ ను పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. సుస్మిత పార్టీలో సభ్యురాలు కాకపోవడం, ఎలాంటి బాధ్యత లేకపోవడంతో.. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నేరుగా మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం సరికాదు
కొండ సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవి ఆదేశించారు. నిన్న రాత్రి షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. మూడు రోజుల సమయం ఉన్నా ఇవాళే కొండా సురేఖ రిప్లయ్ ఇచ్చారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలో చాలా ఆసక్తికర అంశాలు లేవనెత్తారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించాలనడం కరెక్ట్ కాదన్నారు. తనకు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ సమంజసం కాదన్నారు.



