పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత నడుమ అర్ధరాత్రి సమయంలో ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించారు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే జైలు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారని, ఆయనకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని పీటీఐ పార్టీ అధికారికంగా వెల్లడించింది.
గత కొంతకాలంగా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తగిన వైద్య సంరక్షణ అందడం లేదని ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్‌తో పాటు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2022 ఏప్రిల్‌లో పదవీచ్యుతుడైన అనంతరం పలు కేసుల్లో దోషిగా తేలి 2023 నుంచి అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా కుడి కంటి చూపు దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం చికిత్సతో ఆయన చూపు మెరుగుపడిందని తెలిపింది. అయితే అవసరమైతే విదేశాల్లో చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి తెలిపారు.
ప్రస్తుతం షిఫా ఆసుపత్రిలో ఇమ్రాన్ ఖాన్‌కు వివిధ విభాగాల వైద్యులు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల ఫలితాల అనంతరం ఆయన్ను తిరిగి జైలుకు పంపుతారా లేక అక్కడే అడ్మిట్ చేసి చికిత్స అందిస్తారా అనేది తేలనుంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇమ్రాన్‌ను ఆసుపత్రిలోనే కొనసాగించాలని ఆయన కుటుంబ సభ్యులు, పీటీఐ శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి.


