తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇప్పటికే అసమ్మతి రాగం టీ కాంగ్రెస్ లో హైపిచ్ లో వినిపిస్తుండగా.. పదవుల పంపాకాలపై కూడా కొందరు నేతలు నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదివరకు తరచుగా జరిగే పంచాయితీ అయినా ఇప్పుడు కాస్త ఘాటుగా మారిన అంశం.. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ వ్యవహారం.. ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన.. క్రమక్రమంగా కొండా ఫ్యామిలీ మాటలు రాజకీయాల్లో తరచుగా మంటలు పుట్టిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.. గతంలో పలుమార్లు నోరు జారిన.. ఏదో సద్దుమనిగింది.. కానీ ఈసారి మాత్రం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఈ అంశం పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకొన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడ్రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడంతో పాటు ములుగు, పరకాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొండా సురేఖ ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పరకాల బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ ఆధిక్యతతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంటే రాబోయే ఎన్నికల్లో రేవూరే అభ్యర్థి అన్న సంకేతం ఇచ్చినట్లయ్యింది. ఇది జరిగిన మరుసటి రోజే కొండా సురేఖ కుమార్తె పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిపైన, స్థానిక ఎమ్మెల్యేపైన తీవ్ర విమర్శలు చేశారు. తాను కూడా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేస్తానని పేర్కొన్నారు.
మరోవైపు ఢిల్లీలో ఉన్న సీఎం ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కొందరు కీలక నేతలతో ఈ అంశంపై చర్చించినట్టు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రితోనూ, మరికొందరు మంత్రులతోనూ మాట్లాడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే కొండ వ్యవహారం పై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు బుధవారం నోటీసులు కూడా ఇచ్చింది.
ఇక తన కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలినవుతానని సురేఖా అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే రాజకీయంగా గతంలో కొండా ఫ్యామిలీ చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. చివరికి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే.. రానున్న రోజుల్లో రాజకీయాల్లో కొండా ఫ్యామిలి గడ్డుపరిస్థితులు ఎదుర్కో వచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి ఈ వ్యవహారం మళ్ళీ ఎన్నికల నాటికి రాజకీయంగా మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు కొండ సుస్మిత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా? లేక బీఆర్ఎస్ లేదా బీజేపీ సపోర్ట్ తీసుకుని రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తారా?అనేది ఉత్కంఠంగా మారింది.


