కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు మొబైల్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. రియల్‌మీ, ఒప్పో, వివో, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి దిగ్గజ బ్రాండ్లు తమ ఎంపిక చేసిన మోడళ్లపై భారీగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీలో అత్యంత కీలకమైన చిప్‌సెట్లు, ర్యామ్ (RAM), స్టోరేజీ మెమోరీ విడిభాగాల వ్యయం అంతర్జాతీయంగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణంగా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
ఏ బ్రాండ్ ఎంత పెరిగాయంటే..
వివిధ ప్రముఖ బ్రాండ్లు తమ వేరియంట్లను బట్టి ధరలను సవరించాయి. రియల్‌మీ మోడళ్లపై రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు పెంపు విధించగా, ఒప్పో రెనో, ఏ సిరీస్ ఫోన్లపై గరిష్ఠంగా రూ.5వేల వరకు పెంచింది. వివో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.500 నుంచి రూ.4వేల వరకు, వన్‌ప్లస్ రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ధరలను పెంచాయి. ముఖ్యంగా శాంసంగ్ తమ ఎస్, ఎం, ఎఫ్ సిరీస్‌లను సవరించడంతో పాటు గెలాక్సీ ఎస్25 సిరీస్‌లోని ఒక వేరియంట్‌పై ఏకంగా రూ.12వేల వరకు ధరను పెంచడం గమనార్హం.
మున్ముందు మరో 10శాతం పెరిగే ఛాన్స్
మొబైల్ విడిభాగాల ధరల పెరుగుదల వల్ల ఈ ఏడాది జూన్ నాటికే దేశంలో స్మార్ట్‌ఫోన్ల సగటు ధరలు 15శాతం పెరిగాయని మార్కెట్ విశ్లేషణ సంస్థ ఐడీసీ (IDC) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ధరలు మరో 7 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో ఆ భారాన్ని అనివార్యంగా వినియోగదారులపైనే మోపాల్సి వస్తోందని, కొత్తగా మార్కెట్లోకి వచ్చే మోడళ్లు కూడా అధిక ధరలతోనే లాంచ్ అవుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మందగించిన అమ్మకాలు.. పండగ సీజన్‌పైనే ఆశలు
ధరల పెరుగుదల ప్రభావంతో దేశంలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఇప్పటికే గణనీయంగా మందగించాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అమ్మకాలు 13శాతం మేర పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ-కామర్స్ సేల్స్ సమయంలో స్వల్పంగా డిమాండ్ కనిపించినా, ఆ తర్వాత మార్కెట్ మళ్లీ నెమ్మదించింది. అయితే రానున్న పండగ సీజన్‌లో మొబైల్ కంపెనీలు ప్రత్యేక తగ్గింపులు, ఈఎంఐ (EMI) ఫైనాన్సింగ్ సదుపాయాలు, ఆకర్షణీయమైన ఆఫర్లతో మార్కెట్‌ను పుంజుకునేలా చేస్తాయని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


