జోరు పెంచిన జగన్
కూటమిని ఇరుకున పెట్టేలా వ్యూహాలు
జగన్ ప్రెస్‌మీట్ తర్వాత మారిన సీన్
కూటమి సర్కారు డిఫెన్స్‌లో పడిందా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మళ్లీ టాప్ గేర్‌లోకి వచ్చారా? ఇంతకాలం అధికార కూటమిపై రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చిన జగన్.. ఇప్పుడు నేరుగా నిరుద్యోగులు, ఉద్యోగార్థులు, డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కొన్ని అంశాలను, డాక్యుమెంట్లను, ఉదాహరణలను ప్రస్తావించారు. అంతేకాదు.. దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
జగన్ లేవనెత్తిన ప్రశ్నల్లో కీలకమైనది మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కుల పారదర్శకత. తన వాదన ప్రకారం.. గతంలో అభ్యర్థులకు మెరిట్, కటాఫ్, జిల్లా వారీ ఫలితాలపై స్పష్టత ఉండేదని, ఈసారి ఆ ప్రక్రియలో పారదర్శకత తగ్గిందని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థులకు నేరుగా 1:1 నిష్పత్తిలో కాల్‌లెటర్లు ఇచ్చే విధానం ఎందుకు అనుసరించారన్నది జగన్ ప్రశ్న. ఈ అంశాలపై ప్రభుత్వం మాత్రం తన ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని చెబుతోంది.
ఇక జగన్ ప్రస్తావించిన మరో అంశం స్పోర్ట్స్ కోటా. క్రీడా కోటాలో అర్హతలపై అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన కొన్ని నియామకాల ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. జాతీయ స్థాయిలో మెరిట్ సాధించిన వారికి కాకుండా కేవలం పోటీల్లో పాల్గొన్న వారికి ప్రయోజనం దక్కిందా? అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కూటమి సర్కారుకు సవాలే...
ఇక్కడే కూటమి ప్రభుత్వానికి అసలు రాజకీయ సవాల్ మొదలవుతోంది. డీఎస్సీ అంటే కేవలం ఒక ప్రభుత్వ నియామక పరీక్ష కాదు. లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశం. అందుకే పరీక్షలో చిన్న అనుమానం వచ్చినా అది పెద్ద రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమయ్యే అభ్యర్థుల్లో “మనకు న్యాయం జరిగిందా?” అనే సందేహం వస్తే.. దానికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.
అందుకే జగన్ ఇప్పుడు డీఎస్సీని కేవలం ఆరోపణల అంశంగా కాకుండా.. పారదర్శకత వర్సెస్ ప్రభుత్వం అనే రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఆయన మరో అడుగు ముందుకు వేసి.. సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. డీఎస్సీతో పాటు గత ప్రభుత్వ హయాంలోని గ్రూప్-1 వ్యవహారంపైనా విచారణకు సిద్ధమని జగన్ ప్రకటించడం ద్వారా.. ప్రభుత్వం తనపై చేస్తున్న విమర్శలను కూడా ఎదురుదాడిగా మార్చే ప్రయత్నం చేశారు.
జగన్ అసలు వ్యూహం ఇదేనా..?
ఇక్కడ జగన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో యువతలో అసంతృప్తి ఉంటే.. దాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్న ప్రచారాన్ని బలహీనపరచాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉద్యోగార్థుల సమస్య రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ అంశాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. డీఎస్సీ అంశం వైసీపీ క్యాడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయడంలో కూడా ఉపయోగపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే కూటమి కూడా జగన్‌ను వదిలే పరిస్థితిలో లేదు. తన హయాంలో డీఎస్సీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 16 వేలకు పైగా పోస్టులతో నియామకాలు జరిగాయి అంటూ అధికారపక్షం ఎదురుదాడి చేస్తోంది. అంటే జగన్‌కు కూడా ఒక రాజకీయ ప్రమాదం ఉంది. డీఎస్సీపై ఆయన చేస్తున్న ఆరోపణలు నిరూపించలేకపోతే.. కూటమి దాన్ని రాజకీయ ఆరోపణలుగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
ప్రతిపక్షంలో జగన్ యాక్టివ్‌గా లేరు అనే విమర్శలు ఇంతకాలం వినిపించాయి. కానీ ఇప్పుడు డీఎస్సీ అంశాన్ని ఎత్తుకొని, ఉద్యోగార్థుల సమస్యను రాజకీయ అస్త్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత. కూటమి ప్రభుత్వానికి ఇది ప్రతిపక్ష ఆరోపణగా తీసిపారేయగల అంశం కాదు. ఎందుకంటే ఇది యువత ఉద్యోగాల విషయం. మెరిట్ విషయం. భవిష్యత్తు విషయం.
ఇప్పుడు జగన్ విసిరిన బౌన్సర్‌ని కూటమి ఎలా ఎదుర్కొంటుంది..? అన్నదే అసలు సవాల్. వివరణతోనా.. విచారణతోనా.. లేక రాజకీయ ఎదురుదాడితోనా? ఇదే ఇప్పుడు కూటమి ముందున్న ప్రశ్న.
డీఎస్సీ వివాదం రాబోయే రోజుల్లో జగన్‌కు రాజకీయంగా ఎంత బలం ఇస్తుందో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం.. జగన్ మళ్లీ ఫైటింగ్ మోడ్‌లోకి వచ్చారు. ఇక కూటమికి అసలు టెన్షన్ మొదలైందా? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్న.


