తెలంగాణ

సీఎం రేవంత్‌రెడ్డి యూఎస్ పర్యటనకు బ్రేక్.. లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగుపయనం!

రచన: Mamatha puppala••6 నిమిషాల పఠనం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' అధికారిక ప్రతినిధి బృందం అమెరికా పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్డుకుంది. రాజకీయ కోణంలో పరిశీలించి ఈ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు (Political Clearance Denied) కేంద్రం స్పష్టం చేయడంతో సీఎం తన యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' అధికారిక ప్రతినిధి బృందం అమెరికా పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్డుకుంది. రాజకీయ కోణంలో పరిశీలించి ఈ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు (Political Clearance Denied) కేంద్రం స్పష్టం చేయడంతో సీఎం తన యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. యూకే, అమెరికా పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అనుమతి కోరగా, కేంద్రం కేవలం బ్రిటన్ పర్యటనకు మాత్రమే ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని అధికారిక బృందం లండన్ చేరుకున్న తర్వాత కేంద్రం తెలిపింది.

కేంద్రం నిర్ణయంపై రేవంత్ అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్ విద్యాసంస్థలను భారత్‌కు, హైదరాబాద్‌కు తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ యువతకు గ్లోబల్ స్థాయి విద్య, నైపుణ్యాలు అందించేందుకు చేపట్టిన ఈ పర్యటనకు రాజకీయ కారణాలతో బ్రేక్ వేయడం సరికాదని, దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయాల్లో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సీఎం హితవు పలికారు.

అధికారులను కొనసాగాలని సీఎం ఆదేశం

కేంద్ర నిర్ణయానికి కట్టుబడి సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 23న బోస్టన్ వెళ్లకుండా లండన్ నుంచే నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అధికారిక బృందాన్ని మాత్రం అమెరికా పర్యటనను కొనసాగించాలని సీఎం ఆదేశించారు. హార్వర్డ్, ఎంఐటీ (MIT), నార్త్-ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు (MoUs), భాగస్వామ్య ప్రక్రియలను అధికారులు యథావిధిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మారుస్తాం..

ఉస్మానియా, జేఎన్‌టీయూ, హెచ్‌సీయూ, ఐఐటీ, ఐఎస్‌బీలతో హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదిగిందని, ఇప్పుడు ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను తీసుకువచ్చి హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చాలామంది తమ పిల్లలను విదేశాలకు పంపాలనుకుంటే, తాను మాత్రం ప్రపంచ స్థాయి విద్యను సామాన్య భారతీయుడికి ఇక్కడే అందించాలని తపిస్తున్నానని చెప్పారు.

ఉస్మానియా, హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ మాత్రమే కాకుండా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) వంటి ఒకే ఒక్క పాఠశాల కూడా ప్రపంచస్థాయి టెక్ లీడర్లను అందించిందని సీఎం గుర్తుచేశారు. ఐఐటీ, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ (IIIT), నల్సార్ (NALSAR) రాకతోనే హైదరాబాద్‌కు దిగ్గజ సంస్థలు, వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) తరలివచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 21వ శతాబ్దపు ప్రస్థానాన్ని ముందుకు నడిపించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను స్థావరంగా మారుస్తామని తెలిపారు.

విదేశీ విద్య సర్టిఫికేషన్లు అందరికీ అందేలా..

విదేశాలకు వెళ్లలేని సామాన్య భారతీయులకు సైతం హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, లండన్ బిజినెస్ స్కూల్ (LBS) స్థాయి విద్య,ధ్రువపత్రాలు (Certificates) స్థానికంగానే అందేలా చేయడమే తన సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం లండన్‌లో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో పాటు క్రీడా, స్కిల్లింగ్ సంస్థలతో రాష్ట్రానికి భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు సీఎం భేటీ కానున్నారు.

#CM Revanth Reddy US Visit Cancelled#Centre Denies Political Clearance Revanth Reddy#Telangana Rising Delegation UK Tour#Revanth Reddy Harvard MIT MoUs#Revanth Reddy Return to Hyderabad#Telangana Political News Telugu#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి