Visakha Student Death: విశాఖపట్నంలో చోటు చేసుకున్న విషాద ఘటన అందరినీ కలచివేసింది. టీచర్ కొడుతుందన్న భయంతోనే ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఎల్ కేజీ విద్యార్థి క్లాస్ రూమ్ లోనే కుప్పకూలి చనిపోయాడు. బాలుడిని ప్రణయ్ తేజ్ (6) గా గుర్తించారు. లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్నాడు. హోంవర్క్ చేయలేదని క్లాస్ టీచర్ ప్రణయ్ ని మందలించి కొట్టింది. దీంతో ప్రణయ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. గుక్క పెట్టి ఏడ్చాడు. కొట్టొద్దు కొట్టొద్దు అని వేడుకున్నాడు. అలా ఏడుస్తూ, భయపడుతూనే టీచర్ పైనే కుప్పకూలాడు. వెంటనే స్కూల్ సిబ్బంది బాబును కేజీహెచ్ కు తరలించారు. అయితే, అప్పటికే ప్రణయ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలి కాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
విద్యార్థులకు విద్యతో పాటు భద్రత కల్పించడం ప్రతి పాఠశాల యాజమాన్యం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుని కఠిన నిర్ణయాలు అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


