జీవో నంబర్ 97 కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడుతోందని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయదుర్గం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ ఎదుట సుమారు 200 మంది డిప్లొమా విద్యార్థులు ధర్నాకు దిగారు. SBTET పరిధిలో కొనసాగుతున్న తమ డిప్లొమా కోర్సులను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' పరిధిలో విలీనం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ఈ కొత్త జీవో అమలులోకి వస్తే తమ విద్యా విధానం, ఉన్నత విద్య అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉన్న 'లేటరల్ ఎంట్రీ' విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ లేటరల్ ఎంట్రీని తొలగిస్తే, డిప్లొమా పూర్తి చేసిన తర్వాత బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో (2nd Year Direct Entry) చేరే అవకాశం కోల్పోతామని, దీనివల్ల మళ్లీ మొదటి సంవత్సరం నుంచే బీటెక్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు వాపోయారు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్ చదవలేక, డిప్లొమా ద్వారా ఇంజినీరింగ్‌లో చేరామని విద్యార్థులు తెలిపారు. డిప్లొమా తర్వాత ఉన్నత విద్యను అభ్యసించేందుకు లేటరల్ ఎంట్రీయే తమకు ప్రధాన మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వల్ల తమ విద్యా ప్రయాణం మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే జీవో 97పై పునరాలోచించాలని కోరారు.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పరిధిలో కొనసాగుతున్న తమ డిప్లొమా కోర్సులను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' పరిధిలోకి మార్చడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీన ప్రక్రియతో తమ సాంకేతిక విద్యా ప్రమాణాలపై, భవిష్యత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 97 రద్దు చేయాల్సిందేనని.. ప్రభుత్వం వెనక్కి తగ్గేంతవరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు.


