దేశంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగాలేని మారుమూల ప్రాంతాలకు తమ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ 'స్టార్‌లింక్' ఎంతగానో ఉపయోగపడుతుందని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అంతరాన్ని పూడ్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో దేశంలోని ఇంటర్నెట్ నెట్‌వర్క్ పరిస్థితులపై వచ్చిన ఓ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో 2026 మే నాటికి ఇంకా 11,256 గుర్తింపు పొందిన గ్రామాలకు 4G కనెక్టివిటీ లేదని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఇంటర్నెట్ వినియోగంలో తీవ్ర వ్యత్యాసం ఉందని ఆ పోస్ట్ వెల్లడించింది. 2026 మార్చి గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 109.3 కోట్ల ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల వాటా కేవలం 44.08 కోట్లు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 మందికి 48.31 కనెక్షన్లు ఉండగా, పట్టణాల్లో ఈ సంఖ్య 126.80గా నమోదైంది.
ఉపగ్రహాల ఆధారంగా ‘స్టార్ లింక్’
మారుమూల అటవీ గ్రామాలు, కొండ ప్రాంతాలు, ద్వీపాలు, ప్రకృతి విపత్తుల బారిన పడిన ప్రాంతాల్లో సంప్రదాయ కేబుల్స్, మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం భౌగోళికంగా, వాణిజ్యపరంగా కష్టంతో కూడుకున్న పని. దేశంలో 'భారత్‌నెట్' ద్వారా 8.5లక్షల రూట్ కిలోమీటర్లకు పైగా ఫైబర్ వేసి, 2.21లక్షల గ్రామ పంచాయతీలను సిద్ధం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా అనేక ప్రాంతాలు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూకక్ష్యలోని ఉపగ్రహాల ఆధారంగా పనిచేసే స్టార్‌లింక్ నేరుగా వినియోగదారుల టెర్మినల్స్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను సులభంగా అందించగలదని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
అనుమతుల కోసం ఎదురుచూపులు
భారత్‌లో వాణిజ్య సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, నియంత్రణ అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ తుది దశలో కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తయితే మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా వేగవంతమైన అంతర్జాల సేవలు అందుబాటులోకి వస్తాయి.


