హైదరాబాద్‌లోని మాదాపూర్ సమీపంలో గల ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు ఏపీకి చెందిన జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూశ్‌గా పోలీసులు గుర్తించారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే యువతి ప్రమాదవశాత్తు మృతి చెందిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు.
దీంతో నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన ఎంపీ లింగమేని కొడుకు సంజూశ్ మీద మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే, నిందితుడిని ముందుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు .. అతనికి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినట్టు సమాచారం. ఎందుకంటే మద్యం మత్తులో కారు నడిపాడా? అని తెలుసుకునేందుకు ఇలా చేసినట్టు తెలిసింది.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఈ టెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, నిందితుడిని సైతం విచారించినట్టు సమాచారం. విచారణలో భాగంగా నీ పేరేంటి? అని పోలీసులు అడిగిన ప్రశ్నకు సంజూష్ (25) అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారు స్పీడ్ ఎంత? మద్యం కాకుండా ఇంకేమైనా మత్తు పదార్థాలు సేవించాడా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ అసోసియేట్‌గా పనిచేస్తున్న భారతి ముఖి అనే 26 ఏళ్ల యువతి, తన సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో లంచ్ తీసుకురావడానికి వెళ్లింది.
లంచ్ ప్యాకెట్ తీసుకుని తిరిగి మాల్‌లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. ఎంపీ లింగమేని రమేశ్ కొడుకు సంజూశ్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ 'ఆస్టన్ మార్టిన్' (TG-09-G-0666) అత్యంత వేగంగా వచ్చి భారతిని ఢీకొట్టింది. దాంతో భారతి గాల్లోకి ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు సంజూశ్ మీద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు.


