National

సౌత్ వర్సెస్ ఢిల్లీ..! డీలిమిటేషన్‌పై దక్షిణాది కొత్త వ్యూహం.. అసలు లెక్కేంటి?

రచన: Kashi••10 నిమిషాల పఠనం

జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రజాస్వామ్య న్యాయమా? లేక జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించకుండా వారి ప్రస్తుత వాటాను కాపాడటమే న్యాయమా? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం సీట్ల సంఖ్యను నిర్ణయించదు. భవిష్యత్తు భారత రాజకీయాల్లో ఉత్తరం-దక్షిణం మధ్య అధికార సమీకరణాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు.

సీట్ల విష‌యంలో త‌గ్గేదే లేదు

డీలిమిటేష‌న్‌పై ఒక్క‌టైన సౌత్ స్టేట్స్

కేంద్రం ముందు కీల‌క డిమాండ్లు

సదరన్ జోనల్ కౌన్సిల్‌లో ఇదే కీ పాయింట్!

దేశ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి డీలిమిటేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ఆగస్టు 20న తమిళనాడులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు డీలిమిటేషన్ పేరుతో రాజకీయంగా నష్టం జరగకూడదన్నది వారి ప్రధాన వాదన.

దక్షిణాది రాష్ట్రాలకు భయం ఎందుకు?

డీలిమిటేషన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులు, రాష్ట్రాలకు కేటాయించే సీట్లను పునఃపరిశీలించడం. జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఎక్కువ సీట్లు ఉండాలన్నది ప్రజాస్వామ్య ప్రాతిపదిక. కానీ దక్షిణాది రాష్ట్రాల అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది.

కుటుంబ నియంత్రణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా మెరుగైన ఫలితాలు సాధించాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మ‌న జనాభా వృద్ధి తక్కువగా ఉంది. భవిష్యత్తులో జనాభానే ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని సీట్లను పునర్విభజిస్తే.. జనాభా పెరిగిన రాష్ట్రాలకు పార్లమెంటులో ఎక్కువ ప్రాతినిధ్యం, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యం వచ్చే పరిస్థితి ఏర్పడొచ్చన్నది దక్షిణాది వాదన.

అందుకే కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టమైన ప్రతిపాదన చేశారు. లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను 543 వద్దే మరో 25 సంవత్సరాలు కొనసాగించాలని, 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. మహిళా రిజర్వేషన్లను కూడా కొత్త సీట్లు పెంచకుండా ప్రస్తుతం ఉన్న 543 సీట్ల పరిధిలోనే అమలు చేయాలని ప్రతిపాదించారు.

విజయ్ కూడా అదే మాట.. కానీ కొంచెం కొత్తగా!

తమిళనాడు సీఎం విజయ్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం, రాజకీయ ప్రభావం దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాజాగా ఆయన వైఖరి కొంత మారినట్లు కనిపిస్తోంది. మొత్తం డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం కంటే.. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత పార్లమెంటరీ వాటాకు నష్టం జరగకుండా రక్షణ కల్పించాలన్న దిశగా ఆయన మాట్లాడారు.

ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయ పరిణామం. ఎందుకంటే ఇది కేవలం తమిళనాడు సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా మారుతోంది.

మరి కేంద్రం లెక్కలు ఏంటి?

ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన లెక్కను చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఏప్రిల్‌లో లోక్‌సభలో అమిత్ షా వెల్లడించిన లెక్కల ప్రకారం.. ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 816కు పెంచే 50 శాతం పెంపు మోడల్‌లో దక్షిణాది ఐదు రాష్ట్రాల ఎంపీ స్థానాలు కలిపి 129 నుంచి 195కు పెరగవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

ఆ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు, కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి లోక్‌సభ స్థానాలు పెరగవచ్చని కేంద్రం వివరించింది.

మరి సమస్య ఎక్కడుంది?

ఇక్కడే అసలు రాజకీయ లెక్క దాగి ఉంది. దక్షిణాది రాష్ట్రాలు కేవలం తమ సీట్ల సంఖ్యను చూడటం లేదు. మొత్తం పార్లమెంటులో తమ వాటా ఎంత ఉంటుంది? అన్నదే అసలు ప్రశ్న.

ఉదాహరణకు తెలంగాణకు 17 నుంచి 26 సీట్లు వస్తే అది రాష్ట్రానికి సంఖ్యాపరంగా భారీ పెరుగుదలే. కానీ అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ సీట్లు పెరిగితే.. మొత్తం పార్లమెంటులో తెలంగాణ ప్రభావం శాతం ఎంత మారుతుంది? ఇదే ప్రశ్న ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకూ వర్తిస్తుంది.

అందుకే దక్షిణాది నేతలు ఇప్పుడు “మాకు సీట్లు పెంచండి” అనే డిమాండ్ కంటే.. “మా రాజకీయ వాటా తగ్గకుండా చూడండి” అనే డిమాండ్‌ను ముందుకు తీసుకొస్తున్నారు.

ఇది కేవలం డీలిమిటేషన్ పోరాట‌మేనా?

అలా చూస్తే పొరపాటే. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్‌తో పాటు NEET, నదీ జలాల పంపకం, ఆర్థిక స్వయంప్రతిపత్తి, రాష్ట్రాల హక్కులు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అంటే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేస్తూనే.. రాష్ట్రాల హక్కుల విషయంలో ఒక ఉమ్మడి వ్యూహం అవసరం.. అనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.

ఇక్కడే సౌత్ వర్సెస్ ఢిల్లీ అనే రాజకీయ చర్చ మొద‌లైంది. అయితే దీన్ని వెంటనే ఉత్తరాది-దక్షిణాది ఘర్షణగా చూడాల్సిన అవసరం లేదు. అసలు పోరాటం ప్రాతినిధ్యం, జనాభా నియంత్రణకు ప్రోత్సాహం, ఆర్థిక న్యాయం, ఫెడరల్ బ్యాలెన్స్ చుట్టూనే తిరుగుతోంది.

ఏపీ, తెలంగాణకు మాత్రం ఇది కీలకం!

ఈ మొత్తం చర్చలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కేంద్రం ప్రతిపాదించిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 13 అదనపు లోక్‌సభ స్థానాలు, తెలంగాణకు 9 అదనపు స్థానాలు రావచ్చని చెప్పింది.

అంటే సంఖ్యాపరంగా చూస్తే రెండు రాష్ట్రాలకు ఇది లాభమే. కానీ కొత్త సీట్లతో పాటు నియోజకవర్గాల సరిహద్దులు ఎలా మారతాయి? ఏ ప్రాంతాలు కొత్త నియోజకవర్గాలుగా మారతాయి? రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి? ప్రస్తుత ఎంపీల నియోజకవర్గాలు ఎలా ఉంటాయి? వంటి ప్రశ్నలు కూడా కీలకం కానున్నాయి.

ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, గ్రామీణ ప్రాంతాల జనాభా మార్పులు భవిష్యత్తు నియోజకవర్గాల రూపకల్పనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముందు ముందు ఏం జరగొచ్చు?

ప్రస్తుతం ఈ వివాదం ఒక కీలక దశలోకి వెళ్తోంది. ఒకవైపు కేంద్రం దక్షిణాదికి అన్యాయం జరగదు అని చెబుతోంది. మరోవైపు దక్షిణాది నేతలు.. మా ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదు అని స్పష్టం చేస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో ఒకవైపు కేంద్రం లెక్కలు.. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల లెక్కలు.. రెండింటి మధ్య చర్చ మరింత వేడెక్కే అవకాశం ఉంది.

అసలు ప్రశ్న ఒక్కటే..

జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రజాస్వామ్య న్యాయమా? లేక జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించకుండా వారి ప్రస్తుత వాటాను కాపాడటమే న్యాయమా? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం సీట్ల సంఖ్యను నిర్ణయించదు. భవిష్యత్తు భారత రాజకీయాల్లో ఉత్తరం-దక్షిణం మధ్య అధికార సమీకరణాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు.

అందుకే డీలిమిటేషన్ ఇప్పుడు కేవలం నియోజకవర్గాల పునర్విభజన కాదు.. భారత రాజకీయాల్లో వచ్చే దశాబ్దాల పవర్ మ్యాప్‌ను మార్చే అంశంగా మారబోతోంది.

#Delimitation#South India#Delhi#Andhra Pradesh#Telangana#Karnataka#Tamil Nadu#Kerala#Lok Sabha#Political Representation#Federalism#India Politics#South States#Parliament#Delimitation Debate
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి