మంత్రం అంటే కేవలం కొన్ని పదాలను పదేపదే పలకడం కాదు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మంత్రానికి ఎంతో లోతైన అర్థం ఉంది. సంస్కృతంలోని 'మన్' అంటే మనస్సు అని, 'త్ర' అంటే రక్షణ లేదా విముక్తికి సంబంధించిన భావాన్ని సూచిస్తుందని చెబుతారు. అందుకే మంత్రం అంటే మనస్సును చంచలమైన ప్రాపంచిక ఆలోచనల నుంచి క్రమంగా ఏకాగ్రత వైపు నడిపించే పవిత్ర ధ్వని అని ఆధ్యాత్మిక శాస్త్రాలు వివరిస్తాయి.
మంత్రాన్ని 'మననం + త్రాయతే' అని కూడా వివరిస్తారు. మననం అంటే పదేపదే స్మరించడం, జపించడం. త్రాయతే అంటే రక్షించడం. అంటే భక్తితో, నియమంతో మంత్రాన్ని జపించే సాధకుడి మనస్సుకు ఆధారంగా నిలిచి, అతడిని అంతర్ముఖంగా నడిపించేదే మంత్రం అనే భావన ఉంది. అంటే మనస్సును, ప్రాణాన్ని ఒకే దిశలో నడిపించే సాధనే మంత్రజపం అని వేదోత్తములు చెబుతున్నారు.
భారతీయ వేద, తాంత్రిక సంప్రదాయాల్లో ధ్వనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. సృష్టి-నాదం నుంచి ఆవిర్భవించిందనే ఆధ్యాత్మిక భావనలో.. మంత్రాక్షరాలను ప్రత్యేకమైన శక్తిని కలిగిన ధ్వని రూపాలుగా ఋషులు దర్శించారు. ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన ఛందస్సు, ఉచ్చారణ, స్వరం, భావం, నియమం ఉంటాయని శాస్త్రం చెబుతుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు.
రేడియోలో ఒక స్టేషన్‌ను వినాలంటే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని సరిగ్గా ట్యూన్ చేయాలి. అదే విధంగా.. మనస్సును ఒక నిర్దిష్ట దైవభావంపై నిలిపి, మంత్రాన్ని సరైన ఉచ్చారణతో, ఏకాగ్రతతో, నియమబద్ధంగా జపించడం ద్వారా సాధకుడిలో అంతర్గత మార్పు కలుగుతుందని ఆధ్యాత్మిక సంప్రదాయం వివరిస్తుంది. అయితే మంత్రాన్ని ఒకసారి లేదా కొన్ని రోజులు జపించినంత మాత్రాన మంత్రసిద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెప్పడం లేదు.
ఎందుకంటే గురువు ఉపదేశం, మంత్రంపై విశ్వాసం, శుద్ధమైన ఆచరణ, నియమం, ఏకాగ్రత, నిరంతర జపం, ధ్యానం, సాత్త్విక జీవనం.. ఇవన్నీ మంత్రసాధనలో ముఖ్యమైనవి అంటారు. మంత్రసిద్ధి అంటే కేవలం అద్భుత శక్తులను పొందడం కాదు. మంత్రం వల్ల మనస్సు స్థిరపడటం, ఇంద్రియాలపై నియంత్రణ పెరగడం, అంతరంగంలో ప్రశాంతత ఏర్పడటం, దైవభావం బలపడటం.. ఇవే నిజమైన మంత్రసాధన ఫలితాలుగా ఆధ్యాత్మిక మార్గంలో భావిస్తారు.
అందుకే మంత్రం అనేది కేవలం శబ్దం కాదు.. శబ్దంతో మొదలై, ధ్యానంగా మారి, చివరకు అంతర్ముఖ సాధనగా పరిణమించే ఆధ్యాత్మిక మార్గం. ఋషులు దర్శించిన ఈ మంత్రసాధనలోని లక్ష్యం మనస్సును నియంత్రించడమే అని పేర్కొంటారు.. ఇదే మంత్రం యొక్క అంతరార్థం.. ఇదే మంత్రసాధన యొక్క పరమ ప్రయోజనం.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


