స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

TG Congress Group Politics: రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజీ మాటలు!

రచన: Swechaanews Chairman••13 నిమిషాల పఠనం

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంతటా అధికార కాంగ్రెస్ పార్టీ నేతల వివాదాలు రోజుకో రచ్చగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా పని చేసి అభివృద్ది జోడెద్దుల్లా పరిగెత్తాల్సిన తెలంగాణ రైజింగ్ స్టేట్‌లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది.

  • ఎవరి దారి వారిదే అన్నట్టుగా కాంగ్రెస్ నేతల వ్యవహారం

  • ప్రభుత్వంలో ఉన్నారా.. ప్రతిపక్షం నడుపుతున్నారా?

  • జిల్లాల వారీగా మితిమీరిన గ్రూప్ రాజకీయాలు

  • మంత్రులైనా లంచాలు, కమీషన్స్ ఇచ్చి పని చేసుకోవాల్సిందేనా?

  • వీళ్ల ఆగడాలకు ముందుకు రాని కాంట్రాక్టర్స్

  • బడా నేతల కొట్లాటలతో నారాజులో కేడర్?

  • జిల్లాజిల్లాకు గొడవలు కామన్‌గా మార్చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై స్వేచ్ఛ న్యూస్ ఈ-పేపర్‌లో టాప్ న్యూస్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809.

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంతటా అధికార కాంగ్రెస్ పార్టీ నేతల వివాదాలు రోజుకో రచ్చగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా పని చేసి అభివృద్ది జోడెద్దుల్లా పరిగెత్తాల్సిన తెలంగాణ రైజింగ్ స్టేట్‌లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. ఇది తారస్థాయికి చేరి వీళ్ల ఆఫ్ ది రికార్డ్ మాటలతో ఒకరిపై ఒకరు డ్రైనేజ్ మాటలు మాట్లాడుకోవడంతో రైజింగ్ కాదు అంతా డ్రైనేజ్ చేస్తున్నారని ప్రజలు చీదరించుకుంటున్నారు.

ఆదిలాబాద్‌లో మాటలకు అంతే లేదు?

పీఏసీ మీటింగ్‌లో కంది శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చర్చకు దారి తీసింది. మంచిర్యాలలో జిల్లా మంత్రి వివేక్‌కు ప్రేమ్ సాగర్‌కు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వందలకోట్ల అప్పు విషయం ఆ మంత్రే లీక్ చేశారని మంట. ఎంపీ వంశీకృష్ణ పర్యటన, జగన్ మోహన్ రావుని తన శిబరంలోకి తీసుకోవడంతో వివాదం గొడవకు దారి తీసింది. ఈ మంత్రికి మరో కరీంనగర్ మంత్రికి అస్సలు గిట్టడం లేదు. దీంతో ఆదిలాబాద్‌లోని బోధ్, నిర్మల్, చెన్నూర్, బెల్లంపల్లిలో పాత వర్సెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌ల మధ్య సమస్య తలెత్తి ఫ్యాక్షన్ ఫైర్ లాగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు.

నిజామాబాద్‌లో నిక్కచ్చిగానే చెప్పేశారు

రేకులపల్లి భూపతి రెడ్డి వర్సెస్ అకుల లలిత ప్లస్ డీసీసీ ప్రెసిడెంట్ మనాల నాగేష్ రెడ్డి వర్గపోరు ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇటీవలే భాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అరోపణలు చేశారు. ఫోన్స్ కూడా ఎత్తరని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకే ఆ పరిస్థితి ఉంటే ప్రజలకు ఈ ప్రజా పాలనా అందుబాటులో ఉంటుందా అనే విమర్శలు వచ్చాయి. ఏనుగుతో పోచారానికి పడడం లేదని టాక్.

కరీంనగర్‌లో కాకి గోలలే?

ముగ్గురు మంత్రులు ఉన్నా కరీంనగర్ జిల్లాలో అందుబాటులో ఉండే నాయకుడే లేరు. పొన్నం హుస్నాబాద్. టెక్నికల్‌గా సిద్దిపేట జిల్లా. ఈయనకు జగిత్యాల జిల్లా మంత్రిగా ఉన్న అడ్లూరికి పడడం లేదు. పెద్దపెల్లి జిల్లాకు వచ్చే శ్రీధర్ బాబు సైలెంట్‌గా ఉన్నా అభివృద్ది లేదని జిల్లా మొత్తం గోల చేస్తోంది. ఒక్క బిడ్జి నిర్మాణం కోసం భూ సేకరణ మూడేళ్లు అయినా చేయలేదు. దీంతో భట్టి బడ్జెట్‌పై ఫైర్‌గా ఉన్నారు. ఇక్కడ కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. పొన్నం వర్సెస్ అడ్లూరి, వివేక్ వర్సెస్ అడ్లూరిగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. అడ్లూరి ఎంతో మంచిగా ఉండాలని ఆలోచించినా, ఆయనపై ఆధిపత్యం చలాయిస్తూనే ఉన్నారు. ఓ మీటింగ్‌లో పొన్నం మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం.

వరంగల్‌లో ఓవర్ అయిపోయింది

కొండా వర్గం వర్సెస్ కడియం మాత్రమే ఇన్నాళ్లు కనిపించేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు మరో వివాదానికి దారి తీశాయి. ఎన్నికల ప్రచారంలా మొదలు పెట్టిన మాటలు సీఎం అని కూడా చూడకుండా తోటి కేబినేట్ మినిస్టర్ కూతురు కళ్లు నెత్తికెక్కాయా అంటూ సంబోధించడంతో రైజింగ్ తెలంగాణ దేవుడెరుగు డ్రైనేజ్‌లా మారిందని ప్రజలు అంటున్నారు. ఇక్కడ కావ్య వర్సెస్ సుస్మితలా పరిస్థితి ఉంది. ఇన్నాళ్లూ దొంతి వర్సెస్ జిల్లా కాంగ్రెస్‌లా కొనసాగింది. కొండా వర్సెస్ రాజేందర్ రెడ్డి , కొండా వర్సెస్ రేవూరి ప్రకాశ్ రెడ్డిల మధ్య అనేక విమర్శలు, ప్రతి విమర్శలతో కేడర్‌లో గందరగోళం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని సొంత కేడరే వీళ్ల గొడవలను చూసి సైడ్ అవుతున్నారు.

ఖమ్మంలో బడా నేతలు ఉన్నా పొసగడం లేదు

ముగ్గురు మొనగాళ్లలా రెవెన్యూ, ఆర్ధిక, వ్యవసాయ శాఖ మంత్రులు ఖమ్మంలో ఉన్నా ప్రోటోకాల్ వ్యవహారం నుంచి అన్నీ వివాదాలే. పాలేరు నుంచి కాకుండా కొత్తగూడెంపై పొంగులేటి ఫోకస్ చేయడంతో రాజకీయంగా మరింత వేడెక్కింది. ఇప్పటికే రోజుకో వివాదంతో స్టేట్‌లో వార్తలో ఉంటున్న పొంగులేటిపై మరో మంత్రి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని లోలోపల రగిలిపోతున్నారు. తుమ్మల అంటీ ముట్టనట్లు ఉన్నా తన రాజకీయం తన పద్దతిలో చేసుకుంటూపోవడంతో జిల్లాలోని ముగ్గురు మంత్రులకు పడడం లేదనే వాదన ఉంది. అన్ని జిల్లాల్లో జరిగినట్లు ఇక్కడ కూడా బహిరంగానే విమర్శించుకునే రోజు దగ్గరలోనే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నల్గొండలో నరం లేని నాలుకలాగా కాంగ్రెస్ తీరు?

99 శాతం సీట్లు గెలిచినా ఎమ్మల్యేల మధ్య సఖ్యత ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాని పరిస్థితి. తుంగతుర్తిలో కొమటిరెడ్డి బ్రదర్స్ మాటలు, డీసీసీ చీఫ్‌పై వెంకట్ రెడ్డి మాటలు, ఉత్తమ్‌పై జానారెడ్డి వర్గం, అనిల్ కుమార్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిలా వర్గ పోరు కొనసాగుతోంది. ఏకంగా సీఎంనే టార్గెట్ చేసి ఆంధ్రా చెప్పు చేతుల్లో అంతా నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా నోటీసులు ఇచ్చి ఎదురుతిరిగే పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి లేదు. ఇలా నిత్యం నల్గొండడలో ఎవరు ఏ దారిలో మాట్లాడుతారో అర్ధం కాక కేడర్ కన్ఫూజన్‌లోకి వచ్చేశారు.

రంగారెడ్డిలో మంత్రి పదవిపై అసంతృప్తి

అతి పెద్ద జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం లేదని నిత్యం అధిష్టానంపై ప్రెజర్ పెట్టే విషయంలో ఉప్పు నిప్పులా నేతల తీరు ఉంది. మల్ రెడ్డి తీరును కొంతమంది భరించాల్సి వస్తోంది. పరిగి, తాండూర్‌లో కాంగ్రెస్‌కు కాంపిటీషన్ లేకున్నా, ఆ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ప్రజల్లో పేరుకుపోయింది. దీంతో మంత్రి పదవి జపంలో ఎమ్మెల్యేలు ఉంటే ప్రజల అవసరాలు, అభివృద్ది లేదని నిత్యం కొట్లాడుకుంటున్న పరిస్థితి. పట్నం ఫ్యామిలీ వర్సెస్ మిగితా నాయకుల అన్నట్లుగా లోలోపల రగిలిపోతున్నారు. చేవెళ్లలో భీం భరత్ వర్సెస్ కాలే యాదయ్య వర్గ పోరు నడుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై గుర్రుగానే ఉన్నారు. జగదీష్‌ గౌడ్ వర్సెస్ గాంధీ ఉండనే ఉంది. చిన్న చిన్న గొడవలు, మీడియా ముందుకు రాని మాటలు ఎన్నో ప్రజలకు గుచ్చుకుంటున్నాయి.

మెదక్‌లో అంతే..

మంత్రి దామోదర రాజనర్సింహకు ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్‌కు అస్సలు గిట్టడం లేదు. జిల్లాలో ఒక్కొక్క నేత ఫోన్ చేసుకుని కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్‌పై నేరుగా విమర్శలు చేసుకుంటూ మాట్లాడుతారు. జగ్గారెడ్డి, దామోదర ఒకే దారిలో కనిపించినా, నిత్యం సీఎం నిర్ణయాలను తప్పుబడుతూ ప్రజల ముందు ఉంచుతుంటారు. అభివృద్ది ఇంకా చేయడం లేదని అసంతృప్తితో అంతర్గతంగా గొడవలు నడుస్తున్నాయి. పఠాన్ చెరులో గూడెం వర్సెస్ కాటా ఇంకా మంటలు రగులుతూనే ఉన్నాయి. నీలం మధు వర్గం నిత్యం కొత్తదనంతో ఫైట్‌కు సిద్ధంగా ఉండనే ఉంది.

హైదరాబాద్‌లోనూ గోల

దానం నాగేందర్ అసంతృప్తి బయటపడింది. ఎమ్మెల్యేలు లేకుండానే అజారుద్దీన్ వర్సెస్ అంజనీ కుమార్‌లా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఎంఐఎం నేతల సమన్వయంతో బయటకు పొక్కకుండానే ఆధిపత్యం కోసం పార్టీలో మాటలు, మాస్ వార్నింగులు కొనసాగుతున్నాయి. నగర శివారులోని ఓ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఓ కీలక నేత కొడుకు 22ఏ భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఇక, సొంత నేతలైనా కూడా కమీషన్లు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెస్తుండడంతో కాంట్రాక్టర్లు దూరమౌతున్నారు.

మహబూబ్‌నగర్‌లో నిత్యం అసంతృప్తే

సీఎం సొంత జిల్లాలో బ్రదర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉందని బహిరంగంగానే చెబుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ అయితే ఏకంగా ఓ భూ అక్రమం అంటూ హైకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకుంటామని ఎదురుతిరిగి మరీ అడుగుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి తన నిరసన తెలుపుతున్నారు. వనపర్తిలో మేఘా రెడ్డి వర్సెస్ చిన్నా రెడ్డిలా పైసలు ఇచ్చి టికెట్ అంటూ స్టార్ట్ అయిన గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలా మొత్తానికి మూడు షోకాజ్.. ఆరు విమర్శలు.. అయినా ఆగకుండా మరో అడుగు ముందుకేసి ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం జరుగుతోంది. మంత్రులే పొంతన లేని సమాధానాలతో, లోపభూయిష్టమైన మాటలతో రైజింగ్ తెలంగాణలో వీళ్ల తీరు మరోలా ఉందని, సొంత నేతలపై చిల్లర విమర్శలు చేసుకోవడం కంపు కొట్టేలా ఉంది. ప్రత్యర్ధులపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు ఊరుకుంటారు. కానీ, సొంత పార్టీలోనే ఇలా కయ్యాలకు కాలు దువ్వుతుంటే రైజింగ్ సిద్దాంతంలో డ్రైనేజ్ మాటలే ఉన్నాయని విసుగు చెందుతున్నారు. మీడియాకు తెలిసిన మాటలు కొన్నే. చాటుగా నాలుగు. గలీజ్ మాటలు విన్న కార్యకర్తలు చెప్పిన మాటలే స్వేచ్ఛ న్యూస్‌ వార్తగా రాసింది.

#Telangana Congress Group Politics 2026#Revanth Reddy Congress Ministers Disputes#Telangana Congress Internal Fight News#Congress Party Groupism In Districts#Swecha News Political Special Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి